పంచాయతీ అవార్డులకు సరైన వివరాలు ఇవ్వండి
ABN , First Publish Date - 2022-10-08T04:26:54+05:30 IST
జాతీయ పంచాయతీ అవార్డుల కోసం సరైన వివరాలు సమర్పించాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా సూచించారు.
ఈ నెల 15 చివరి గడువు
జిల్లాలోని అన్ని జీపీలు పోటీపడాలి
అదనపు కలెక్టర్ రాజర్షిషా
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 7: జాతీయ పంచాయతీ అవార్డుల కోసం సరైన వివరాలు సమర్పించాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పాల్గొని సరైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. అవార్డులకు సంబంధించిన వివరాలను ఈ నెల 15లోగా ఎంపీడీవోలకు అందజేయాలని పంచాయతీ కార్యిదర్శులను రాజర్షిషా ఆదేశించారు. తొమ్మిది కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అవార్డుల కోసం నిర్దేశించిన ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నావళిలో ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి పూర్తి సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలన్నారు. అసంపూర్తి వివరాలు పూరించరాదని సూచించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నో పనులు జరుగుతున్నా వాటికి సరిగ్గా చూపించలేకపోతున్నారని అన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై ఆధారపడడం సమంజసం కాదని, ఆయా వివరాలను పూర్తి స్థాయిలో ధ్రువీకరించుకుని పూరించాలని పంచాయతీ కార్యదర్శులకు అదనపు కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు ఎంపీవోలు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. తొమ్మిది అంశాలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులు ప్రశ్నావళిలో పూరించిన వివరాలను స్వయంగా సరిచూసుకోవాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో పంచాయతీ కార్యదర్శుల సహకారంతో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాల్సిన పూర్తి బాధ్యత ఎంపీడీవోలదేనని అదనపు కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో డివిజన్ పంచాయతీ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పోటీల్లో తీసుకోవాల్సిన చర్యలు, అంశాల వారిగా వివరాలను ఎలా పూరించాలి తదితర విషయాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో గాయత్రీదేవి, శిశు మహిళా సంక్షేమ అఽధికారి పద్మావతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.