అమీన్పూర్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ
ABN , First Publish Date - 2022-08-04T06:08:38+05:30 IST
గ్యాస్ లీకై గదిలో మంటలు అంటుకోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది.
ఐదుగురికి తీవ్రగాయాలు... నలుగురి పరిస్థితి విషమం
పటాన్చెరు, ఆగస్టు 3: గ్యాస్ లీకై గదిలో మంటలు అంటుకోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది. అమీన్పూర్ సీఐ శ్రీనువాసులరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం స్థానిక హెచ్ఎంటీ కాలనీ రోడ్డు నెంబర్ 17లో గదిలో తెనాలికి చెందిన వై.సుబ్రహ్మణ్యం(30), ప్రశాంతి(25) దంపతులు నివాసం ఉంటున్నాడు. అతడు సెల్ఫోన్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి పడుకునే ముందు స్టౌ ఆఫ్ చేయకపోవడంతో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై గదంతా వ్యాపించింది. రాత్రంతా గ్యాస్ లీక్ అయ్యింది. ఉదయం 6 గంటల సమయంలో పాలు కాచేందుకు పొయ్యిని వెలిగించగా గ్యాస్ ద్వారా మంటలు వ్యాపించాయి. గదిలోని ప్రశాంతి, సుబ్రహ్మణ్యం, ఆయన మామ సాంబశివరావు (50), దివ్యశ్రీ (5), 14నెలల శమరిహరన్ తీవ్రంగా గాయపడ్డారు. దివ్యశ్రీకి తప్ప మిగతా అందరికీ 80శాతానికి పైగా శరీరం కాలిపోయింది. బాధితులను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.