సత్ఫలితాలిస్తున్న బడిబాట

ABN , First Publish Date - 2022-06-07T05:43:28+05:30 IST

సర్కారు బడుల్లో పిల్లల నమోదు సంఖ్య పెంచడమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది.

సత్ఫలితాలిస్తున్న బడిబాట
పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలంటూ సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీచర్లు

జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 1,115 ప్రవేశాలు

మన ఊరు-మన బడికి పెరిగిన ఆదరణ

ఆంగ్లమాధ్యమ బోధనపై ఆసక్తి

మారనున్న సర్కారు బడుల రూపురేఖలు!!

ఈ సారి భారీగా పెరగనున్న ఎన్‌రోల్‌మెంట్‌


సంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 6 : సర్కారు బడుల్లో పిల్లల నమోదు సంఖ్య పెంచడమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ముఖ్యంగా ‘మన ఊరు-మన బడి‘ కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మరో వైపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండటంతో పాఠశాలల్లో కొత్తగా విద్యార్థుల ప్రవేశాలు పెంచడంపై విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ నెల 3 నుంచి ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ పేరిట బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ నెల 10 వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత 13 నుంచి 30 వరకు రోజు వారీగా పాఠశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. 


రెండు రోజుల్లో 1,115 ప్రవేశాలు

బడిబాట కార్యక్రమం ద్వారా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 1,115 మంది పిల్లలు సర్కారు బడుల్లో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో ఈ నెల 3న 344 మంది ఉండగా, 4న 771 మంది ఉన్నారు. అయితే ఇందులో ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరే వారి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి కూడా పిల్లలు భారీగానే చేరుతున్నారు. బడి బాట కార్యక్రమం అమలులో భాగంగా తొలి రోజు పాఠశాల పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో పిల్లల వివరాలను ఆయా పాఠశాలల టీచర్లు ఇంటింటికి తిరిగి నమోదు చేశారు. ప్రధానంగా బడిబాట ప్రాధాన్యంపై ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, తల్లిదండ్రులతో సమావేశం, మన ఊరు-మన బడి పథకం ద్వారా సమకూరే మౌలిక సదుపాయాలు, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఆంగ్ల మాద్యమం గురించి వివరిస్తున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా బడిబాట కార్యాచరణ అమలు చేస్తున్నారు.

  సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏటా బడిబాట కార్యక్రమాన్ని జూన్‌లో నిర్వహిస్తుండే వారు. అయితే కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా దీనిని చేపట్టలేదు. మళ్లీ కొవిడ్‌ ఉధృతి తగ్గడంతో సర్కారు మళ్లీ బడిబాట కార్యక్రమం ద్వారా బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరగడంపై దృష్టి సారించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమల చేస్తుండటంతో పాఠశాలలకు మహర్ధశ పట్టనున్నది. జిల్లాలో తొలి విడతగా 441 సర్కారు పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రైవేటుకు దీటుగా మౌలిక వసతులు పెరగనున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగి సర్కారు బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమం ప్రారంభమవుతున్న నేపఽథ్యంలో ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే పిల్లలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల్లో కూడా ఓ వైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో పాఠ్యపుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. పిల్లల విద్యాభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వారిని చేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని డీఈవో నాంపల్లి రాజేష్‌ పేర్కొన్నారు. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. 


మెదక్‌ జిల్లాలో 423 మంది చేరిక

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూన్‌ 6: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంతో 423 మంది విద్యార్థులు బడిలో చేరినట్లు మెదక్‌ జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. మనోహరాబాద్‌  మండలం కాళ్లకల్‌లో ఆదివారం నిర్వహించిన బడిబాటలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడీడు పిల్లలను బడిలో చేర్చుకుంటామన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో మొదటి విడత నిధులు విడుదల అయ్యాయని, వాటితో నీటి వసతి, విద్యుదీకరణ, శానిటేషన్‌ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కాళ్లకల్‌ పాఠశాలకు మన ఊరు  మన బడిలో రూ. 6 లక్షలు మంజూరైనట్లు డీఈవో రమేష్‌కుమార్‌ వివరించారు. 



Updated Date - 2022-06-07T05:43:28+05:30 IST