సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-12-31T23:06:27+05:30 IST

సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌, డిసెంబరు 31: సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జగన్‌చారి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అప్పులు చేసి తాము గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, దీంతో వడ్డీలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు సర్పంచులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఈఈ అంజయ్య, డిప్యూటీ ఈఈ ప్రసాద్‌, ఏఈలు మాధవనాయుడు, రాకేష్‌, తదితరులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, అసిస్టెంట్‌ డీఎం ప్రవీణ్‌, మార్కెటింగ్‌ సేల్‌ ఇన్‌చార్జి పాండుతోను ఎమ్మెల్యే ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవల గురించి సమీక్షించారు. నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. అనంతరం డీసీసీబీ బ్యాంక్‌, టీపీటీఎఫ్‌ నూతన క్యాలెండర్లను ఆయా సంఘాలతో కలిసి ఆవిష్కరించారు. కాగా పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన అయ్యప్ప పడి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:06:27+05:30 IST

Read more