లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-08-04T06:07:29+05:30 IST
ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా పోలీసు, కోర్టు అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్ కోరారు.
సంగారెడ్డి క్రైం, ఆగస్టు 3: ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా పోలీసు, కోర్టు అధికారులతో పాటు న్యాయవాదులు కృషి చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్ కోరారు. సంగారెడ్డి జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు అధికారులు, జూనియర్ సివిల్ జడ్జిలతో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. క్రిమినల్ కాంపౌండేబుల్, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం, కుటుంబ, వివాహ తగాదాలు, భూ సేకరణ తదితర కేసులు పరిష్కరించనున్నట్టు తెలిపారు. స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి హన్మంతరావు మాట్లాడుతూ కక్షిదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ కేసులను రాజీ మార్గాన పరిష్కరించుకొనే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి నిర్మల పాల్గొన్నారు.