పోదాం పద జాతర

ABN , First Publish Date - 2022-03-01T04:40:53+05:30 IST

సర్పయాగస్థలిలో వెలిసిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు శివరాత్రి ఉపవాస దీక్షలతో ప్రారంభమయ్యే ఐదు రోజుల జాతర రథోత్సవంతో ముగిస్తుంది. శివసత్తులు శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతర ముగింపు వరకు కనువిందు చేస్తాయి. పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో మంజీరా నది ఒడ్డున కొండగుహలో వనదుర్గామాత వెలిసింది. ప్రతీ ఏడాది శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది.

పోదాం పద జాతర
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం

శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు

ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు పూర్తి


పాపన్నపేట, ఫిబ్రవరి 28: సర్పయాగస్థలిలో వెలిసిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు శివరాత్రి ఉపవాస దీక్షలతో ప్రారంభమయ్యే ఐదు రోజుల జాతర రథోత్సవంతో ముగిస్తుంది. శివసత్తులు శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతర ముగింపు వరకు కనువిందు చేస్తాయి. పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో మంజీరా నది ఒడ్డున కొండగుహలో వనదుర్గామాత వెలిసింది. ప్రతీ ఏడాది శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రికి ఒక్కరోజు ముందే ఏడుపాయలకు చేరుకుని దుర్గామాత సన్నిధిలో ఉపవాస దీక్షలు చేపడుతారు. మరుసటి రోజు జరిగే బండ్ల ఊరేగింపును తిలకించి వెనుదిరుగుతారు. ఒకప్పుడు కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం భక్తుల కోసం అన్ని వసతులు ఉన్నాయి. జాతర ఐదురోజులు భక్తుల రద్దీతో అటవీ ప్రాంతం నగరాన్ని తలపిస్తుంది. ఐదు రోజుల జాతరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధశాఖల జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు శివరాత్రి ఉపవాసాలు, రేపు బండ్ల ఊరేగింపు, గురువారం అమ్మవారికి రథోత్సవం నిర్వహించనున్నారు. 


విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : కలెక్టర్‌

ఏడుపాయలలో జాతర ఏర్పాట్లను కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ట్రైనీ కలెక్టర్‌ అశ్వినీవాఖడే సోమవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, పార్కింగ్‌, రహదారులపై లైటింగ్‌ ఏర్పాట్లును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నేడు ఉదయం 8:30 గంటలకు మంత్రి హరీశ్‌రావు వనదుర్గామాతకు పట్టువస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వెయ్యి మంది పోలీసు సిబ్బంది, 600 మంది పారిశుధ్య కార్మికులు, 400 మంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి జిల్లా యంత్రాంగానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనవెంట ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి, శ్యామ్‌ప్రకాష్‌, డీపీవో తరుణ్‌కుమార్‌ ఉన్నారు. అలాగే, మెదక్‌ డీఎస్పీ సైదులు, పాపన్నపేట ఎస్‌ఐ విజయ్‌నారాయణ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ మొబైల్‌ పార్టీలు, మహిళా పోలీసులు, స్పెషల్‌ పార్టీ, డాగ్‌స్క్వాడ్‌, అదనపు బలగాలు భద్రతా విధుల్లో పాలుపంచుకుంటాయని, జాతర ప్రాంతమంతా సీసీ కెమెరాలు అమర్చినట్టు వెల్లడించారు. జాతరకు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి హాజరవుతారని ఆలయ ఇన్‌చార్జి ఈవో సార శ్రీనివాస్‌ తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులు అధికారులకు సహకరించి, జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 


మహాశివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు

మెదక్‌ అర్బన్‌/చిలప్‌చెడ్‌/నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 28: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లాలో శివాలయాలు ముస్తాబయ్యాయి. మెదక్‌ పట్టణం బ్రాహ్మణ వీధిలోని ప్రాచీన శివాలయం, కుమ్మరిగడ్డ శివాలయాలను పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. చిలప్‌చెడ్‌ మండలం పరిధిలోని చండూరులో గుట్టపై తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెలసిన రామలింగేశ్వర ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో త్రిభువన మల్లుడు నిర్మించినట్టు ఇక్కడ లభ్యమైన శాసనాలు తెలియజేస్తున్నాయి. అప్పట్లో మునులు ఇక్కడ తపస్సు చేసేవారని, వారు స్నానమాచరించడానికి నిర్మించిన గుండమే విస్తరించి నేడు కనిపించే చెరువుగా మరిందని చెప్పుకుంటారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో 30 అడుగుల ఎత్తైన రథం ప్రధానాకర్ణణగా నిలుస్తుంది. ఆలయంలో నేడు శివపార్వతుల కల్యాణం,  శివస్వాముల దీక్షా విరమణ పూజలు నిర్వహించనున్నారు. రేపు బండ్ల ఊరేగింపు, గురువారం పాచిబండ్ల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం రథోత్సవం కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లి సంగమేశ్వర గుట్టపై వెలసిన సంగమేశ్వర ఆలయాన్ని ఉత్సవాలకు ముస్తాబు చేశారు. ఇక్కడ రెండు రోజులు ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేడు అభిషేకాలు, హోమం, ప్రదోశపూజలు, పల్లకీసేవ, జాగరణ, లింగోద్భవ పూజలు, రేపు శివపార్వతుల కల్యాణం, అన్నదానం  జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2022-03-01T04:40:53+05:30 IST