గోపాలమిత్రలకు దసరా కానుక
ABN , First Publish Date - 2022-10-07T05:34:48+05:30 IST
జిల్లా పశుగణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుకగా వేతనం పెంచింది
30 శాతం వేతనం పెంచుతూ ఉత్వర్వులు
ఉమ్మడి జిల్లాలో 143 మందికి లబ్ధి
మెదక్‌అర్బన్, అక్టోబరు6: జిల్లా పశుగణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుకగా వేతనం పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సేవలందిస్తున్న గోపాలమిత్రలకు గుర్తింపుగా సర్కారు ప్రస్తుతం చెల్లిస్తున్న పారితోషికానికి అదనంగా.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం పెంచే విధంగా పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంటూ..పాడి గేదెలకు కృత్రిమ గర్భాధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ వంటి తదితర సేవలు గోపాలమిత్రుల అందిస్తున్న సంగతి తెలిసిందే.
30 శాతం పెంపు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 143 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8,500 చొప్పున గౌరవవేతనం అందిస్తుంది. చాలీచాలనీ ఈ వేతనం కూడా ప్రతి నెలా అందడం లేదు. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీనితో కుటుంబ పోషణ భారంగా మారింది. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ 30 శాతం పెంచుతున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలమిత్రలకు ప్రస్తుతం రూ.8500 చెల్లిస్తుండగా.. పెరిగిన 30 శాతంతో రూ.2,250 కలుపుకొని మొత్తం రూ.11,050 అందనున్నది. ఈ పెంపుతో ఉమ్మడి జిల్లాలోని 143 మందికి లబ్ది చేకూరనుంది. గౌరవ వేతనం 30 శాతం పెంపుపై గురువారం గోపాలమిత్రల జిల్లా అధ్యక్షుడు రామస్వామి, ఉపాధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో మెదక్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు తలసాని, హరీశ్‌రావుకు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.