నేడే ముహూర్తం

ABN , First Publish Date - 2022-11-30T00:22:30+05:30 IST

సంగారెడ్డి, కంది మండలాల పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రవేశాలకు ముహూర్తం కుదిరింది. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదితో పాటు కంది మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్లు వచ్చినవారికి నేడు సర్టిఫికెట్లు అందజేసి గృహప్రవేశాలు చేయించనున్నారు.

నేడే ముహూర్తం

డబుల్‌బెడ్‌రూం కాలనీల్లో గృహప్రవేశాలకు ఏర్పాట్లు

425 మందికి తీరనున్న సొంతింటి కల

హాజరుకానున్న మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌/కంది, నవంబరు 29 : సంగారెడ్డి, కంది మండలాల పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రవేశాలకు ముహూర్తం కుదిరింది. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదితో పాటు కంది మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్లు వచ్చినవారికి నేడు సర్టిఫికెట్లు అందజేసి గృహప్రవేశాలు చేయించనున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రదేశాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గృహప్రవేశాలకు ముఖ్య అతిథులుగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతాప్రభాకర్‌ హాజరుకానున్నారు.

ఫసల్‌వాదిలో 329, కందిలో 96 గృహాలు

సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని ఎంఎన్‌ఆర్‌ చౌరస్తాలో రూ.18.92 కోట్ల వ్యయంతో నిర్మించిన 329 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నేడు లబ్ధిదారులకు లాంఛనంగా అప్పగించనున్నారు. ఈ గృహాల్లో సంగారెడ్డి పట్టణానికి 265, ఫసల్‌వాదికి 44, కులబ్‌గూర్‌కు 20 ఇళ్లను కేటాయించారు. ఇళ్ల కోసం 7,500 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో సంగారెడ్డి పట్టణంలో 6,500 మంది, ఫసల్‌వాదిలో 650 మంది, కులబ్‌గూర్‌లో 350 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత సంవత్సరం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులను గుర్తించారు. సంగారెడ్డి పట్టణంలో 1,286 మంది, ఫసల్‌వాదిలో 65 మంది, కులబ్‌గూర్‌లో 23 మంది అర్హులుగా గుర్తించారు. ఆగస్టు 3న ఆర్డీవో మెంచు నగేష్‌ పర్యవేక్షణలో డ్రా నిర్వహించి ఇళ్లను కేటాయించారు. అలాగే, కంది మండల కేంద్రంలో రూ.5.69 కోట్లతో నిర్మించిన 96 గృహాలను లబ్ధిదారులకు నేడు అప్పగించనున్నారు. ఇక్కడ 800 మంది దరఖాస్తులు చేసుకోగా క్షేత్రస్థాయి విచారణలో 500 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో డ్రా ద్వారా 96 మందికి ఇళ్లు దక్కాయి.

అన్ని హంగులతో సిద్ధం

డబుల్‌ బెడ్‌రూం గృహ ప్రవేశాలకు నేడు ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఫసల్‌వాది శివారులో 329, కంది శివారులో 96 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. వీరికి గృహాలతో పాటు ప్రొసీడింగ్‌ పత్రాలను నేడు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, హెచ్‌డీసీ చైర్మన్‌ చింతాప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌లు అందజేయనున్నారు. గృహప్రవేశాలను అట్టహాసంగా నిర్వహించేందుకు డబుల్‌బెడ్‌రూం కాలనీలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు

కంది, ఫసల్‌వాదిలోని డబుల్‌బెడ్రూం కాలనీల వద్ద ఏర్పాట్లను రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌ మంగళవారం పరిశీలించారు. నేడు గృహ ప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, నాయకులు బొంగుల రవి, విజయేందర్‌రెడ్డి, చక్రపాణి, నర్సింహులు, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:22:32+05:30 IST