‘డబుల్‌’ ఇళ్లను పేదలకే ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-24T05:44:38+05:30 IST

మనోహరాబాద్‌ మండల కేంద్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుపై పేదలు సోమవారం రెండోరోజు సైతం ఆందోళన చేపట్టారు.

‘డబుల్‌’ ఇళ్లను పేదలకే ఇవ్వాలి
మనోహరాబాద్‌ తహసీల్‌ కార్యాలయం వద్ద ఆందోళన

 మనోహరాబాద్‌లో రెండోరోజు డప్పుచప్పుళ్లతో ర్యాలీ, ఆందోళన 

 కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మద్దతు  

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మే 23:  మనోహరాబాద్‌ మండల కేంద్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుపై పేదలు సోమవారం రెండోరోజు సైతం ఆందోళన చేపట్టారు. నిరుపేదలు ఉదయం డప్పు చప్పుళ్లతో హైవే-44 రోడ్డు వరకు వచ్చి, ఊళ్లోకి రాకుండా రోడ్డుపై గంటపాటు బైఠాయించారు. అక్కడి నుంచి మళ్లీ డప్పు చప్పుళ్లతో ర్యాలీగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అడ్డంగా బైఠాయించారు. దీంతో ఎస్‌ఐ రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి ఎవరూ చొచ్చుకురాకుండా తలుపులను మూసేశారు. కాగా ఆందోళనకారులు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ నిరసన చేపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులకు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. దీంతో తహసీల్దారు భిక్షపతి వారివద్దకు వచ్చి ప్రజల సమ్మతం మేరకు లబ్ధిదారుల ఎంపికకు డ్రా తీసినట్లు వివరించారు. ఇదే విషయాన్ని తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఎంపిక చేసిన విధానాన్ని వివరించారు.  రోడ్డు విస్తరణలో పేదలు కాకుండా ధనవంతులకు ఇళ్లిచ్చారని, ఒక్కొక్కరికి రెండు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇచ్చారని బాధితులు ఆరోపించారు. పేదల నుంచి దరఖాస్తులను అందజేయాలని కోరగా, పేదలకు ఇళ్లను కేటాయింపు జరిపే వరకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అక్కడ ఆందోళనకు దిగిన 48 మంది పేదలు తహసీల్దారుకు దరఖాస్తును అందజేశారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్లిచ్చినపుడు మా ఇళ్లు ఏమయ్యాయని ఇమాంపూర్‌కు చెందిన యాదగిరిగౌడ్‌, ఆంజాగౌడ్‌ ప్రశ్నించారు. ఈ విషయం తెలిసి గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అక్కడకు విచ్చేయగా, బాధితులు తమ గోడును వెళ్లగక్కారు. దీంతో నర్సారెడ్డి తహసీల్దార్‌ను ఇళ్ల కేటాయింపు విషయమై ప్రశ్నించిన అనంతరం ఆర్డీవో, గడ ప్రత్యేక అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రోడ్డు విస్తరణ బాధితులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  వాళ్లకు పరిహారంగా రూ. 50 లక్షలిచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటించని నాయకుడు తమకెందుకని ప్రశ్నించారు.  

Read more