న్యాయవ్యవస్థ కళ్లు తెరిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ

ABN , First Publish Date - 2022-12-02T00:12:28+05:30 IST

దేశంలో కక్షపూరిత రాజకీయాలు వికటట్టాహాసం చేస్తూ హద్దులు మీరుతున్నాయని, వీటిపై న్యాయవ్యవస్థ కళ్లు తెరిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

న్యాయవ్యవస్థ కళ్లు తెరిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలి

మోదీ ప్రతిపక్షాలపై కక్షపూరితంగా దాడులు చేయిస్తున్నారు

పల్లెపల్లెల్లో ఎర్ర జెండాలు ఎగురవేయాలి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్‌, డిసెంబరు 1 : దేశంలో కక్షపూరిత రాజకీయాలు వికటట్టాహాసం చేస్తూ హద్దులు మీరుతున్నాయని, వీటిపై న్యాయవ్యవస్థ కళ్లు తెరిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్‌ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో సీపీఐ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై సిట్‌ విచారణ జరుపుతుండగా, కేంద్రం తరఫున ఇక్కడ పలువురి నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేస్తున్నారని, లిక్కర్‌ స్కాం వంటి కుంభకోణాలతో రాజకీయాల్లో ఉన్నవారు ప్రజా సేవకులా..? లేక సంపాదకులా అనే చర్చ జరుగుతుందన్నారు. రాజకీయ నాయకులు అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారన్నారు. దేశంలో 5,907 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేర చరిత్ర కలిగి ఉన్నారని తెలిపారు. ఈ కేసులను సుప్రీంకోర్టు నాన్చకుండా తక్షణమే తీర్పులు ఇవ్వాలన్నారు. ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తేనే మరొక్కరు అలాంటి నేరం చేయరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం జగన్మోహన్‌రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తారని హైదరాబాద్‌కు మార్చారని వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై కక్షపూరితంగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పల్లెపల్లెల్లో ఎర్రజెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసే వరకు పోరాటం సాగించాలన్నారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల పూర్తికి మిలిటెంట్‌ ఉద్యమాలు సాగించాలన్నారు. ప్రభుత్వానికి మిత్రపక్షమైనా ప్రజా సమస్యలపై పోరాటాలు ఆగవని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ సిద్దిపేట, కరీంనగర్‌, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు మంద పవన్‌, మర్రి వెంకటస్వామి, కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్‌, అదరి శ్రీనివాస్‌, కోహెడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, అందె స్వామి, అనిల్‌కుమార్‌, జాగిరి సత్యనారాయణ, శంకర్‌, భాస్కర్‌, లక్ష్మారెడ్డి, వనేష్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అంబలి కేంద్రాల ఏర్పాటు అభినందనీయం

హుస్నాబాద్‌ రూరల్‌ : విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Updated Date - 2022-12-02T00:13:14+05:30 IST