వడ్ల పైసలు ఎప్పుడిస్తరు?

ABN , First Publish Date - 2022-11-17T23:58:26+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించి మూడు వారాలు గడుస్తున్నా డబ్బు చేతికి రాకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు.

వడ్ల పైసలు ఎప్పుడిస్తరు?

ధాన్యం విక్రయించి 20 రోజులైనా ఖాతాల్లో జమకాని డబ్బులు

1,34,591 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

మిల్లులకు చేరింది 1,27,534 మెట్రిక్‌ టన్నులు

చెల్లించాల్సిన సొమ్ము రూ.277.26 కోట్లు

ఖాతాల్లో జమ చేసింది రూ.20.38 కోట్లే

రూ.256.88 కోట్ల బకాయిలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, నవంబరు 17: ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించి మూడు వారాలు గడుస్తున్నా డబ్బు చేతికి రాకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకం వేసిన రెండు రోజుల్లో డబ్బులు చెల్లిస్తామనే ప్రకటనలు ఆచరణలో అమలు కావడంలేదు. మెదక్‌ జిల్లాలో ఈ వానాకాలం 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 5 లక్షల మెట్రిక్‌ టన్నల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి పీఏసీఎస్‌, ఐకేపీ, డీసీఎంఎస్‌, ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 వరకు జిల్లావ్యాప్తంగా 26,139 మంది రైతుల నుంచి 1,34,591 మెట్రిక్‌ టన్నల వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో 1,27,534 మెట్రిక్‌ టన్నులు రైస్‌ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.277.26 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు 2004 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రూ.20.38 కోట్లు విడుదల చేశారు. ఇంకా 24,135 మంది రైతులకు సంబంధించిన రూ.256.88 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది.

48 గంటల నిబంధన వట్టిదే..

జిల్లాలో రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వారాలు గడిచినా డబ్బులు జమ కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సీజన్‌కు సమాయత్తమవుతున్న తరుణంలో పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. తరువాతి పంటకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బులు లేక అదను దాటిపోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్రిమెంట్‌ ప్రక్రియలో ఆలస్యం

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లులకు తరలిస్తారు. ధాన్యం తీసుకున్న అనంతరం రైస్‌ మిల్లుల నుంచి ట్రక్‌షీట్‌ వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అయితే కస్టమ్‌ మిల్లింగ్‌కు సంబంధించి రైస్‌ మిల్లర్లతో సీవిల్‌ సప్లై అధికారులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం నేరుగా రైస్‌ మిల్లులకు తెచ్చే బాధ్యత తమదేనని, ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సరఫరా చేస్తామని ఒప్పందం పత్రం రాసివ్వాలి. ఒప్పంద పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే వడ్లు అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించే వీలుంటుంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నది. కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. అయితే రైస్‌ మిల్లర్లతో అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో వడ్లు అమ్మిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.

15 రోజులైనా డబ్బులు రాలే : శేఖర్‌, రైతు, హవేళిఘనపూర్‌

మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించాను. 15 రోజులవుతున్నా ఇప్పటి వరకు పైసలు ఖాతాలో జమ కాలేదు. కూలీలు, హమాలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారు. యాసంగి సీజన్‌ కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నది. పొలాలను దున్నడానికి కూడా చేతిలో డబ్బులు లేవు.

Updated Date - 2022-11-17T23:58:35+05:30 IST