దక్కనీ గొర్రెల పెంపకాన్ని చేపట్టాలి
ABN , First Publish Date - 2022-06-10T05:30:00+05:30 IST
మేలు జాతి రకానికి చెందిన దక్కనీ గొర్రెల పెంపకాన్ని అత్యధిక సంఖ్యలో చేపట్టి భవిష్యత్ తరాలకు అందించాలని గొర్రె, మేకల పెంపకందారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ఈ మాంసం విక్రయానికి రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తాం
జిల్లాలో 51 బృందాలతో నట్టల నివారణ మందు పంపిణీ
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్, జూన్ 10 : మేలు జాతి రకానికి చెందిన దక్కనీ గొర్రెల పెంపకాన్ని అత్యధిక సంఖ్యలో చేపట్టి భవిష్యత్ తరాలకు అందించాలని గొర్రె, మేకల పెంపకందారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రెలకు నట్టల నివారణ మాత్రలను వేసి దక్కనీ జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారుల, క్షేత్ర సహాయకులకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్కనీ జాతి గొర్రెలు ఎక్కువగా రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందని, మాంసం రుచిగానూ పోషకాలతో కూడి ఉంటుందని అవగాహన కల్పించారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన రుచికరమైన దక్కనీ గొర్రె మాంసాన్ని అందించేందుకు సిద్దిపేట పట్టణంలోని నాన్‌వెజ్ మార్కెట్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఇక నుంచి దక్కనీ గొర్రెల మాంసాన్ని విక్రయించి లాభాలు పొందాలని కోరారు. గొర్రెలు ఆరోగ్యంగా పెరిగేందుకు నట్టల నివారణ మందులను సంవత్సరానికి మూడు పర్యాయాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో 51 బృందాల ద్వారా 8 లక్షల 94 వేల గొర్రెలకు ఈ మందును పంపిణీ చేస్తామన్నారు. మిట్టపల్లి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉన్నదని, రైతులు ఆయిల్‌పామ్ పంట సాగును చేపడితే ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు. ఉచితంగా పామాయిల్ మొక్కలతో పాటు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ సామగ్రిని అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకల ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు, అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్ లక్ష్మి, స్థానిక నాయకులు ప్రవీణ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.