దామోదర వ్యాఖ్యలతో దుమారం!

ABN , First Publish Date - 2022-12-15T00:13:09+05:30 IST

పీసీసీ పదవుల నియామకంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు అన్యా యం జరిగిందని, సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు పదవులు దక్కాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

దామోదర వ్యాఖ్యలతో దుమారం!

అధిష్ఠానానికి నర్సారెడ్డి ఫిర్యాదు

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు14: పీసీసీ పదవుల నియామకంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు అన్యా యం జరిగిందని, సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు పదవులు దక్కాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ ఆ తర్వాత నుంచి పార్టీలో క్రీయాశీలక పదవులు పొందినా పార్టీని బలోపేతం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. రచ్చబండ, మరే ఇతర కార్యక్రమాలను అందోలు నియోజకవర్గంలో సరిగా నిర్వహించలేదని ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పించిన సందర్భాలూ ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు పార్టీ పదవులు కట్టబెట్టారని దామోదర చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీవాదులు తిప్పికొడుతున్నారు.

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డిని కొనసాగించిన అధిష్ఠానం ఉపాధ్యక్షుడిగా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట నుంచి పూజల హరికృష్ణను నియమించింది. వీరిలో పూజలు హరికృష్ణ దామోదర అనుచరుడేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన ఇద్దరిలో కోవర్టులు ఎవరన్న ప్రశ్న తలెత్తుతున్నది. కోవర్టులు ఎవరో తనకు తెలిసి ఉంటే వారి పేర్లను దామోదర్‌ అధిష్ఠానికే తెలియజేస్తే ఆయన గౌరవం పెరిగి ఉండేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న దుబ్బాకకు చెందిన చెరుకు శ్రీనివా్‌సరెడ్డికి, నర్సాపూర్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్‌కు, రామాయంపేట ప్రాంతం నుంచి సుప్రభాత్‌రావుకు పదవులు రాకపోవడం వల్లే దామోదర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కోవర్టులు ఎవరో తేల్చండి

సిద్దిపేట జిల్లాలో కోవర్టులు ఎవరో తేల్చాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నర్సారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌ను, మరికొందరు పార్టీ పెద్దలను కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు సమాచారం. దామోదర రాజనర్సింహ సూచించిన వారికి పార్టీ పదవులు రానంత మాత్రాన పదవులు పొందిన వారిని కోవర్టులని విమర్శించడం సరికాదని ఆయన తన వినతిపత్రంలో పేర్కొన్నట్టు తెలిసింది. కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా పార్టీ వ్యవహారాలను, ప్రత్యేకించి దుబ్బాక నియోజకవర్గ పార్టీ పని తీరుపై ప్రత్యేక దృష్టిసారించిన దామోదర్‌ ఇప్పుడు పార్టీకి నష్టం కలగజేసేలా వ్యాఖ్యలు చేశారని నర్సారెడ్డి తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎవరిని ఉద్దేశించి కోవర్టులని విమర్శించారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. పార్టీ పెద్దలుగా కొనసాగుతున్న ఇలాంటి వారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీకి మరింతగా నష్టం జరుగుతుందని నర్సారెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

Updated Date - 2022-12-15T00:13:10+05:30 IST