నిరుపేదలకు ఆపద్బంధు సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2022-05-25T05:23:15+05:30 IST

నిరుపేదలకు ఆపద్బంధు సీఎం సహాయనిధి అని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

నిరుపేదలకు ఆపద్బంధు సీఎం సహాయనిధి
సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపీణీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

త్వరలోనే రూ. 10 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి

నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, మే 24: నిరుపేదలకు ఆపద్బంధు సీఎం సహాయనిధి అని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. త్వరలోనే రూ.10 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. ఆస్పత్రికి వైద్యానికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు చెక్కులను బ్యాంకు ఖాతాలో జమచేసుకోవాలన్నారు. 

కుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్‌ కాపీలు పంపిణీ

నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరు మండలంలో రంగాయపల్లి యాదవ కమ్యూనిటీహాల్‌కు రూ.10 లక్షలు, సికింద్లాపూర్‌ రెడ్డి కాలనీలో కమ్యూనిటీహాల్‌కు రూ.5 లక్షలు, అలాగే ఏకలవ్య కమ్యూనిటీహాల్‌కు రూ.5 లక్షలు, మేడిపల్లి గ్రామంలో కమ్యూనిటీహాల్‌కు రూ.10 లక్షలు, అలాగే మండల కేంద్రమైన నంగునూరులో ఆటో యూనియన్‌ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.40 లక్షల ప్రొసీడింగ్‌ కాపీలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండల, గ్రామ ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, నియోజకవర్గ మండల ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆధైర్య పడకండి అండగా నేనుంటా

అధైర్య పడకండి అండగా నేనుంటానని మృతుల కుటుంబసభ్యులకు మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని చిన్నకోడూరు మండలం గంగాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ ముల్కల కనకరాజు తండ్రి రాములు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులను హరీశ్‌రావు పరామర్శించారు. పట్టణంలోని ఇందిరానగర్‌లోని టీఆర్‌ఎస్‌ నాయకుడు గుర్రం బాలరాజుగౌడ్‌ భార్య ఉమ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందింది. వారి కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట చిన్నకోడూరు ఏంపీపీ మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు రాధాకృష్ణశర్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలసాయిరాం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి ఉన్నారు. 

వెంకటేశ్వరాలయం అభివృద్ధికి కృషి : హరీశ్‌రావు

సిద్దిపేట కల్చరల్‌, మే 24: శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి నిరంతరంగా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆలయంలో 47వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. సిద్దిపేట వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని, 1974లో ఈ ఆలయాన్ని పెద్ద జీయర్‌స్వామి చేతులమీదుగా ప్రతిష్ఠింపబడిందని చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన ఆలయం 47వ వార్షిక  బ్రహ్మోత్సవాలు జరగడం సంతోషంగా ఉన్నదన్నారు. ఆలయంలో రూ.50 లక్షలతో ధ్యాన మందిరం మొదటి అంతస్తు నిర్మిస్తున్నామన్నారు. ఎంతో మహిమాన్వితమైన వెంకన్నస్వామికి వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల వరకు బంగారు కిరీటాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఒక ఆధ్యాత్మిక వైభవాల ఖిల్లా అని అన్నారు. ఆ సంకల్పంతోనే సిద్దిపేట ఒక రిజర్వాయర్ల ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు. అనంతగిరి పోచమ్మ నుంచి కొమురవెల్లి మల్లన్నదాకా రిజర్వాయర్లు నిర్మించుకోవడంతోనే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యిందన్నారు. మనజిల్లాలో ఇప్పటివరకు రూ.70 కోట్లతో పురాతన, కొత్త ఆలయాలను నిర్మించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, నాయకులు పాల్గొన్నారు.

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న హరీశ్‌రావు

చేర్యాల, మే 24: చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు రెండోరోజూ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం నాభిశిల రాతి విగ్రహాలకు జలాధివాసం, పుష్పాధివాసం పూజలు నిర్వహించారు. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలతో ఊరేగింపుగా నీటిని తీసుకొచ్చి అభిషేకించారు. కాగా మంత్రి హరీశ్‌రావు వేడుకలకు హాజరై పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచన, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-25T05:23:15+05:30 IST