పత్తి రైతు చిత్తు

ABN , First Publish Date - 2022-12-07T00:31:21+05:30 IST

తెల్ల బంగారం రైతన్నను కంటనీరు పెట్టిస్తున్నది. అతివృష్టి, తెగుళ్లతో దెబ్బతిన్న పంటను వ్యయ ప్రయాసలకోర్చి కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి ధర పతనం కావడంతో బావురుమంటున్నారు.

పత్తి రైతు చిత్తు

తగ్గిన దిగుబడి.. పడిపోయిన ధర

గతేడాది క్వింటా రూ. 10వేలకు పైగా.. ఈసారి రూ. 8,500కే పరిమితం

పెట్టుబడి తిరిగిరావడమూ కష్టమే

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు 6: తెల్ల బంగారం రైతన్నను కంటనీరు పెట్టిస్తున్నది. అతివృష్టి, తెగుళ్లతో దెబ్బతిన్న పంటను వ్యయ ప్రయాసలకోర్చి కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి ధర పతనం కావడంతో బావురుమంటున్నారు. ఓవైపు ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడులు పడిపోయాయి. మరోవైపు మార్కెట్‌లో పత్తి ధర భారీగా తగ్గింది. గతేడాది రికార్డుస్థాయిలో రూ. 10వేలు దాటిన పత్తి ధర ఈసారి రూ. రెండున్నర వేలకుపైగా తగ్గింది. గత వారం రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పడిపోయింది. మరింత పతనమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సీజన్‌ ప్రారంభంలో పత్తి ధర నాణ్యతను బట్టి రూ.9 వేలకు పైగా ధర పలికింది. దీంతో లాభాలు రాకపోయినా పెట్టుబడి అయినా తిరిగి వస్తుందని రైతులు ఆశించారు. రోజు రోజుకు ధర పడిపోవడంతో దిగాలుపడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు పత్తికి రూ.6,838 చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.8,300 నుంచి రూ.8,500కు కొంటున్నారు.

జిల్లాలో 48 వేల ఎకరాల్లో సాగు..

మెదక్‌ జిల్లాలో ఈసారి 92 వేల ఎకరాల్లో పత్త పంటను సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేశారు. కానీ సమృద్ధిగా వర్షాలు పడడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. దీంతో పత్తి సాగు విస్తీర్ణం 48,257 ఎకరాలకు పరిమితమైంది. మండలాలవారీగా అల్లాదుర్గంలో 14,442 ఎకరాలు, రేగోడ్‌లో 9,840 ఎకరాలు, టేక్మాల్‌లో 7,160 ఎకరాలు, పెద్దశంకరంపేటలో 6,880 ఎకరాలు, చిల్‌పచెడ్‌లో 1,500 ఎకరాలు, కొల్చారంలో 1,365 ఎకరాలు, కౌడిపల్లిలో 1,250 ఎకరాలు, నర్సాపూర్‌లో 1,119 ఎకరాలు పత్తి సాగు చేశారు. 50 వేల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

కంటనీరు పెట్టిస్తున్న ధర

సాధారణంగా పత్తి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురియడంతో పంట ఎదుగుదల దెబ్బతిన్నది. తెగుళ్లు కూడా దెబ్బతీశాయి. పూత, కాత నిలబడలేదు. రైతులు ఎంతో ఖర్చుచేసి మందులు పిచికారీచేసి పంటను కాపాడుకున్నా దిగుబడులు భారీగా తగ్గాయి. ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి దిగిబడి రావడం లేదు. గతేడాది రికార్డుస్థాయిలో ధర పలకడంతో ఈసారి భూమి కౌలు విపరీతంగా పెంచారు. దీనికితోడు పురుగుమందులు, ఎరువులు, కూలీలు, ఇతర ఖర్చులు కలుపుకుని పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర గతేడాది మాదిరిగా రూ. 10 వేలకు పైగా ఉంటే పెట్టుబడులైనా తిరిగి వస్తాయని రైతులు ఆశించారు. కానీ వారం రోజుల్లోనే క్వింటా పత్తి రూ.8వేల నుంచి రూ.7 వేల రూపాయలకు పడిపోయింది.

వ్యాపారులు, దళారుల కుమ్మక్కు

పత్తి ధర ఒక్కసారిగా తగ్గడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కాటన్‌ ధరలు, పత్తి గింజలు, పత్తి నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ స్థానికంగా రేటు తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు, మధ్య దళారులు ఒక్కటై పత్తి ధరను తగ్గిస్తున్నారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఖర్చులతో క్వింటాలుకు రూ.12 వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని, లేదంటే భారీగా నష్టపోక తప్పదని రైతులు పేర్కొంటున్నారు.

పత్తికి మద్దతు ధర రూ. 10 వేలు చేయాలి : సాయిలు, పల్వంచ, టేక్మాల్‌ మండలం

పత్తి పంటకు ప్రభుత్వం మద్ధతు ధరను పెంచాలి. మార్కెట్‌లో ధర లేక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో కన్నా వ్యాపారుల దగ్గరనే ధర ఎక్కువగా ఉంది. గిట్టుబాటు ధర తక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ధరను తగ్గిస్తున్నారు. అందుకే ప్రభుత్వం స్పందించి క్వింటాలు రూ.10 వేలు చెల్లించాలి.

Updated Date - 2022-12-07T00:31:23+05:30 IST