హైదరాబాద్‌ శివారులో కోడిపందాలు

ABN , First Publish Date - 2022-07-07T06:02:14+05:30 IST

హైదరాబాద్‌ నగర శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధి చిన్నకంజర్ల మామిడితోటలో నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్‌ శివారులో కోడిపందాలు
పోలీసుల అదుపులో కోడిపందాలు ఆడుతున్న నిందితులు

పోలీసుల దాడిలో 22 మంది అరెస్ట్‌

రూ.13.12 లక్షల నగదు స్వాధీనం

మరో 48 మంది కోసం గాలింపు

పరారైన వారిలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

పటాన్‌చెరు, జూలై 6 : హైదరాబాద్‌ నగర శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధి చిన్నకంజర్ల మామిడితోటలో నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. పందాలను భారీఎత్తున నిర్వహిస్తుండగా, ఏపీలోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఈ దాడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. చిన్నకంజర్ల మామిడితోటల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారని పటాన్‌చెరు పోలీసులకు బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. డీఎస్పీ భీంరెడ్డి నేతృత్వంలో సబ్‌డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు సిబ్బందితో తోటలో నిర్వహిస్తున్న కోడిపందాలపై దాడులు నిర్వహించారు. పందాలకు పెద్దఎత్తున పోగైనవారు పోలీసులు రాకను గమనించి తలో దిక్కున పరారయ్యారు. పోలీసులు వెళ్లే సరికి సుమారు 70మంది ఘటనా స్థలంలో ఉండగా అందులో 22 మందిని అదుపులోకి తీసుకోగలిగారు. మిగతావారు పరారయ్యారు. అందే గుంపులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని సైతం పరారయ్యారని డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 250లోని మామిడితోటను అద్దెకు తీసుకుని కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అక్కినేని సతీష్‌, బర్ల శ్రీను, కృష్ణంరాజుల నేతృత్వంలో కోడి పందాలను నిర్వహించారని డీఎస్పీ పేర్కొన్నారు. పందాల్లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున బుధవారం సాయంత్రమే కార్లలో తోటకు చేరుకున్నారు. మొత్తం 22మందిని అదులోకి తీసుకుని రూ.13,12,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. 25 వాహనాలు, 25 సెల్‌ఫోన్లు, 31 కోళ్లు, నాలుగు చనిపోయిన కోళ్లు, 31 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితులను అరెస్ట్‌ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. 

Read more