టోల్‌గేట్‌ మూసేస్తారా!?

ABN , First Publish Date - 2022-04-12T05:52:11+05:30 IST

భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హైవేలపై టోల్‌ప్లాజాల మధ్యస్థ దూరం నిర్ధిష్టం చేయడంతో కొన్ని టోల్‌ప్లాజాలను మూసేయనున్నారు. రెండు టోల్‌ప్లాజాల మధ్యదూరం 60 కిలోమీటర్లు ఉండాలన్న నిబంధనలతో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

టోల్‌గేట్‌ మూసేస్తారా!?
తూప్రాన్‌ టోల్‌ప్లాజా

రెండు టోల్‌ప్లాజాల మధ్య దూరం 60 కిలోమీటర్లు ఉండాలని నిబంధన

గతనెల లోక్‌సభలో ప్రస్తావించిన మంత్రి నితిన్‌ గడ్కారీ

తూప్రాన్‌, బిక్‌నూర్‌ టోల్‌ప్లాజాల మధ్య  దూరం50.79 కిలోమీటర్లే

రెండింటిలో ఏదో ఒకటి మూసివేత!!


తూప్రాన్‌, ఏప్రిల్‌ 11: భారత జాతీయ రహదారుల సంస్థ  (ఎన్‌హెచ్‌ఏఐ) హైవేలపై టోల్‌ప్లాజాల మధ్యస్థ దూరం నిర్ధిష్టం చేయడంతో కొన్ని టోల్‌ప్లాజాలను మూసేయనున్నారు. రెండు టోల్‌ప్లాజాల మధ్యదూరం 60 కిలోమీటర్లు ఉండాలన్న నిబంధనలతో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

  గతనెల 23న లోక్‌సభలో కేంద్ర ఉపరితలరవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కా రీ చేసిన ప్రకటనతో టోల్‌ప్లాజాల మధ్య దూరం మార్పు చేసుకోబోతుంది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్‌ప్లాజాలకు అనుమతిలేదని రానున్న మూడు మాసాల్లో తొలగిస్తామని నితిన్‌ గడ్కారీ ప్రకటించారు. అయితే హైవే 44 హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ రోడ్డుపై తూప్రాన్‌, బిక్‌నూర్‌ టోల్‌ప్లాజాలపై నిర్వహణపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టోల్‌ప్లాజాల మధ్యస్థ దూరం నివేదికలను పంపినట్లు సమాచారం. 

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న హైవే 44 (పాత హైవే 7)ను హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ మార్గంలో నాలుగు లైన్ల రోడ్డుగా రంగారెడ్డి జిల్లా బోయిన్‌పల్లి (481.331 కి.మీ.) నుంచి కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ఎల్లారెడ్డి (368.255 కి.మీ.) వరకు 113 కిలోమీటర్ల పొడవు విస్తరించారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులో (మనోహరాబాద్‌) ఏర్పాటైన టోల్‌ప్లాజాను 2009 ఏప్రిల్‌ 19 అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 113 కిలోమీటర్ల పరిధిలో ఒకే టోల్‌ప్లాజా ఉండడంతో మరో టోల్‌ప్లాజాకు అధికారులు నిర్ణయించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ వద్ద మరో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. బోయి న్‌పల్లి నుంచి మెదక్‌ జిల్లా చేగుంట వరకు (481.331 కి.మీ. నుంచి 419.793 కి.మీ.) 61.538 కిలోమీటర్లను మనోహారాబాద్‌ టోల్‌ప్లాజాగా అల్లాపూర్‌ శివారులో నిర్వహిస్తున్నారు. మెదక్‌ జిల్లా చేగుంట (419.793 కి.మీ.) నుంచి కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డి (368.255 కి.మీ.) వరకు 51.538 కిలోమీటర్లకు బిక్నూర్‌ వద్ద టోల్‌ప్లాజా నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ హైవే 44 రోడ్డుపై తూప్రాన్‌ (మనోహరాబాద్‌) టోల్‌ప్లాజా నుంచి బిక్‌నూర్‌ టోల్‌ప్లాజా మధ్యస్థ దూరం 50.79 కిలోమీటర్లు. ఇదే మార్గంలో బిక్‌నూర్‌ టోల్‌ప్లాజా నుంచి ఇందల్వాయ్‌ టోల్‌ప్లాజా మధ్యస్థ దూరం 63.97 కిలోమీటర్లు. తూప్రాన్‌, బిక్‌నూర్‌ టోల్‌ప్లాజాల మధ్య దూరం50.79 కిలోమీటర్లు ఉండటంతో ఏదో ఒక టోల్‌ప్లాజా మూసివేతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2022-04-12T05:52:11+05:30 IST