ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్రలో గొడవ
ABN , First Publish Date - 2022-12-15T00:18:01+05:30 IST
సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం పరిధిలోని బర్దీపూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడిపై దాడి ఉద్రిక్తతకు దారి తీసింది.
ఝరాసంగం, డిసెంబరు 14: సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం పరిధిలోని బర్దీపూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడిపై దాడి ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. బర్దీపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా పార్టీలోని జంగం గోపీ వర్గీయులు, చింతల్‌గట్టు సుధీర్‌కుమార్ వర్గీయుల మధ్య గొడవ జరిగి పరస్పర దాడులకు పాల్పడ్డారు. అదే సమయంలో గోపీ వర్గీయులు భరోసా యాత్రకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డిపైనా దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. నరేందర్‌రెడ్డికి బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. అంతర్గత పోరు ప్రభావం వల్లే పరస్పర దాడులు జరిగాయని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ సమాచారమందుకున్న స్థానిక ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు.