తెలంగాణ రైస్‌ ఇండస్ట్రీని కేంద్రం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-07-19T05:17:06+05:30 IST

మిల్లింగ్‌ చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తీసుకోవాలని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి తొడుపునూరి చంద్రపాల్‌ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ రైస్‌ ఇండస్ట్రీని కేంద్రం ఆదుకోవాలి
రైస్‌ మిల్లుల్లో మొలకెత్తిన ధాన్యం ఫొటోలను మీడియాకు చూపుతున్న చంద్రపాల్‌

43 రోజులుగా మూలన పడ్డ పరిశ్రమ

మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలి

రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి తొడుపునూరి చంద్రపాల్‌

మెదక్‌ అర్బన్‌, జూలై 18: మిల్లింగ్‌ చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తీసుకోవాలని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి తొడుపునూరి చంద్రపాల్‌ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఎఫ్‌సీఐ ప్రొక్యూర్‌మెంట్‌ నిలిపివేయడంతో రైస్‌ మిల్‌ ఇండస్ర్టీకి ఎదురైన గడ్డు పరిస్థితులపై సోమవారం జిల్లా కేంద్రంలోని రైస్‌ మిల్లు భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైస్‌ మిల్లు ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య ఏర్పడిందన్నారు. 43 రోజులుగా పరిశ్రమ మూగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ప్రసుత్తం 3,400 మిల్లులున్నాయన్నారు. మిల్లింగ్‌కు ఏడేళ్లుగా సహకరిస్తూ వస్తున్న కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా ప్రొక్యూర్‌మెంట్‌ను నిలిపి వేసిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది కార్మికులు పని లేకపోవడంతో రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు రుణాలను కట్టలేక, వేతనాలు చెల్లించలేక చతికిల పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రైస్‌ మిల్లుల వద్ద 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పేరుకుపోయిందన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. కేంద్రం బియ్యం తీసుకొని సహకరించాలని, దీనిపై కేంద్ర ఆహార మంత్రి పీయూ్‌షగోయల్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు సంజయ్‌, అరవింద్‌ స్పందించాలని కోరారు. దేశ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్‌ హరీశ్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో అసోసియేషన్‌ ఏరియా అధ్యక్షుడు సంతో్‌షరెడ్డి, కార్యదర్శి మల్లేశం, ఉపాధ్యక్షులు పురుషోత్తం, వేణుగోపాల్‌, శంకర్‌, రాము, అశోక్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Read more