శ్మశానవాటిక సరే.. దారేది?
ABN , First Publish Date - 2022-08-05T05:19:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామం (శ్మశానవాటిక) నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదు.
అల్లాదుర్గం, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామం (శ్మశానవాటిక) నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదు. అల్లాదుర్గం మండలంలోని ముప్పారం గ్రామంలో మూడేళ్ల క్రితం గ్రామ శివారులో నిర్మింపజేసిన వైకుంఠధామానికి వెళ్లేందుకు దారి లేక నిరుపయోగంగా మారింది. గ్రామంలో ఎవరైనా మరణిస్తే శ్మశానవాటికకు తీసుకెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారివారి వ్యవసాయ పంట చేనుల వద్దకు తీసుకెళ్లి ఖననం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు. ఈ వైకుంఠధామానికి వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని పలు సమావేశాల్లో అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి రోడ్డు ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.