నెత్తుటి సాక్ష్యం

ABN , First Publish Date - 2022-09-17T05:53:09+05:30 IST

రజాకార్ల పాశవికదాడులను ఎదిరించి నిలిచిన గ్రామం బైరాన్‌పల్లి. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ధమనకాండకు నెత్తుటి సాక్ష్యంగా దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి, కూటిగల్‌ గ్రామాలు నిలుస్తున్నాయి.

నెత్తుటి సాక్ష్యం
బైరాన్‌పల్లి బురుజు


రజాకార్లను హడలెత్తించిన బైరాన్‌పల్లి


మద్దూరు, సెప్టెంబరు 16 : రజాకార్ల పాశవికదాడులను ఎదిరించి నిలిచిన గ్రామం బైరాన్‌పల్లి. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ధమనకాండకు నెత్తుటి సాక్ష్యంగా దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి, కూటిగల్‌ గ్రామాలు నిలుస్తున్నాయి. నిజాం రజాకార్ల దాడులు పెట్రేగి పోతున్న తరుణంలో కమ్యూనిస్టుల సహాయంతో వారి ఆగడాలను ఎదిరించేందుకు బైరాన్‌పల్లి గ్రామస్థులు ఇమ్మడి రాజిరెడ్డి నేతృత్వంలో గ్రామరక్షణ దళాలుగా ఏర్పడి పోరాటం చేశారు. నిజాం రజాకార్ల నాయకుడు అవ్వల్‌సాబ్‌ కుమారుడు బైరాన్‌పల్లి గ్రామస్థుల చేతిలో హతమవ్వడంతో ఎలాగైనా గ్రామాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న రజాకార్లు ఐదుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. గ్రామంలో కమ్యూనిస్టుల బలం ఎక్కువగా ఉందని మున్ముందు మనపైకే దాడి చేసే అవకాశం ఉందని ఖాసీం రజ్వీకి మొరపెట్టుకున్న అవ్వల్‌సాబ్‌ తుదకు రజాకార్లు, పోలీసులు, మిలటరీ సహాయంతో పెద్దఎత్తున దాడికి దిగారు. తెల్లవారుజామున బైరాన్‌పల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు. గ్రామంలోని బురుజుపైనున్న గస్తీ దళాలు వారిని ఎదిరించి కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిప్పురవ్వ ఎగిసి బురుజు మీదున్న మందుగుండు సామగ్రి పేలి గ్రామ రక్షకులు నేలకూలారు. దీంతో గ్రామంలోకి చొబడ్డ రజాకార్లు దొరికిన వారిని దొరికినట్లు విచక్షణ రహితంగా కాల్పిచంపారు. కనపడ్డ స్ర్తీలను చెరబట్టారు. శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడించి రాక్షసానందం పొందారు. ఈ దాడిలో బైరాన్‌పల్లిలో ఒకే రోజు 96 మంది చనిపోయారు. గ్రామానికి వెన్నుదన్నుగా నిలిచిన కూటిగల్‌ గ్రామంపై పడి 30 మందిని పొట్టనపెట్టుకున్నారు. నాటి జ్జాపకాలకు నిలువెత్తు సాక్షంగా మైసమ్మ మర్రి, ఽశిథిలమైన బురుజు, కూటిగల్‌లో బురుజు, తూటాల మర్రి సజీవంగా ఉన్నాయి. 


Updated Date - 2022-09-17T05:53:09+05:30 IST