కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-08-04T05:51:43+05:30 IST

కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించి వైద్యులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

రామచంద్రాపురంలో రూ.20.7 కోట్లతో 

ఆధునీకరించిన ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రారంభం

వైద్యుల పనితీరుపై మంత్రి అసంతృప్తి


రామచంద్రాపురం, ఆగస్టు 3: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించి వైద్యులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. రామచంద్రాపురం పట్టణంలో రూ.20.7 కోట్లతో ఆధునీకరించిన ఈఎస్‌ఐ ఆసుపత్రిని బుధవారం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాజీ ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్యులతో మాట్లాడారు. వైద్యసేవల్లో వారు సాధించిన పురోగతిపై అడిగారు. ఇప్పటి వరకు ఒక్క సాధారణ ప్రసూతి జరగకపోవడం, జూలైలో కేవలం 3 సిజేరియన్లు జరగడంపై మంత్రి ఆరా తీశారు. 55 మంది డాక్టర్లు, సుమారు 60 మంది నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 300 మంది సిబ్బంది ఉన్నప్పటికీ రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విషయాన్ని గుర్తించారు. ఆర్థో, ఐ, ఈఎన్‌టీ వంటి శస్త్ర చికిత్సలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు వైద్యులు ఆధునీకరణ కారణంగా వసతులు లేక చేయలేకపోయామని చెప్పే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ఎన్ని చేశారని మంత్రి ప్రశ్నించగా సరైన జవాబు రాలేదు. ‘దయుంచి వైద్య సేవలందించండి అంటూ మంత్రి వైద్యులను కోరారు. ప్రభుత్వ పీహెచ్‌సీల్లో ఒకే ఎంబీబీఎస్‌ డాక్టర్‌ రోజుకు 5 వరకు సాధారణ ప్రసూతీలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. వైద్యులకు ఇక్కడ పనిలేకపోతే పీహెచ్‌సీలకు వచ్చి సేవలందించాలంటూ చెప్పారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని మల్టీస్పెషాలిటీ ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పటాన్‌చెరులో మరో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ మినీ ఇండియాగా ఉన్న పటాన్‌చెరులో 90 శాతం కార్మికులు ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు. పటాన్‌చెరులో 200 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఇప్పటికే టెక్నికల్‌ మంజూరు సాధించామన్నారు. కార్పొరేటర్‌ వి.సింధూఆదర్శరెడ్డి మాట్లాడుతూ ఎంఎంటీఎస్‌ రైల్వే లైన్‌ ఏర్పాటులో ఇళ్లను కోల్పోయిన పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను త్వరగా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు   బి.పుష్పనగేష్‌, మెట్టుకుమార్‌యాదవ్‌, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, రాష్ట్ర కార్మిక నాయకుడు యాదగిరియాదవ్‌, సూపరిండెంట్‌ సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజయ్యయాదవ్‌, యాదగిరియాదవ్‌, మోహన్‌గౌడ్‌, ఆదర్శరెడ్డి, నగేశ్‌, గోవింద్‌, కుమార్‌గౌడ్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:51:43+05:30 IST