సంగారెడ్డి, సదాశివపేటకు బస్తీ దవాఖానాలు

ABN , First Publish Date - 2022-03-15T05:44:20+05:30 IST

సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో బస్తీ దవాఖానాలను మంజూరు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీల్లో 31 స్లమ్‌ ఏరియాలు, సదాశివపేట మున్సిపాలిటీలలో 20 స్లమ్‌ ఏరియాలున్నాయని చెప్పారు.

సంగారెడ్డి, సదాశివపేటకు బస్తీ దవాఖానాలు

ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరిన మేరకు మంజూరు

అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి


ఆంధ్రజ్యోతిప్రతినిధి,సంగారెడ్డి, మార్చి14: సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో బస్తీ దవాఖానాలను మంజూరు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీల్లో 31 స్లమ్‌ ఏరియాలు, సదాశివపేట మున్సిపాలిటీలలో 20 స్లమ్‌ ఏరియాలున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య రక్షణకు ఎన్ని వీలైతే అన్ని బస్తీ దవాఖానాలను మంజూరు చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఇందుకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా స్లమ్‌ ఏరియాలున్నాయని, ముస్లిం జనాభా కూడా ఎక్కువ ఉందన్నారు. జగ్గారెడ్డి కోరినట్టు సంగారెడ్డి, సదాశివపేటలకు బస్తీ దవాఖానాలను మంజూరు చేస్తామని హరీశ్‌రావు తెలిపారు.


హజ్‌హౌస్‌ నిర్మాణం చేపట్టాలి

సంగారెడ్డికి మంజూరైన హజ్‌హౌస్‌ భవన నిర్మాణాన్ని  దీన్‌దాన్‌ఖాన్‌ ఫంక్షన్‌హాల్‌ పక్కన ఉన్న స్థలంలో చేపట్టాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. సంగారెడ్డికి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు హజ్‌హౌస్‌ మంజూరు చేసి భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారన్నారు. భూ సమస్య తలెత్తడంతో భవన నిర్మాణానికి స్థలం మార్పు చేశారని చెప్పారు. ఈ భవన నిర్మాణాన్ని దీన్‌దార్‌ఖాన్‌ ఫంక్షన్‌ హాల్‌ పక్కన చేపట్టాలని కోరారు. సంగారెడ్డిలో ఈద్గా ప్రహరీ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని గతంలో మంత్రి హరీశ్‌రావు కూడా హామీ ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే  జగ్గారెడ్డి తెలిపిన అంశాలను నోట్‌ చేసుకున్నానని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-15T05:44:20+05:30 IST