ఆశల సాగు

ABN , First Publish Date - 2022-07-06T05:51:29+05:30 IST

నిత్యం కరువుతో విలవిలలాడుతూ వ్యవసాయంపై ఆశలు వదులుకున్న హుస్నాబాద్‌ ప్రాంత రైతాంగానికి రెండేళ్లుగా మంచిరోజులు వచ్చాయి. సంవత్సరాల నుంచి సకాలంలో కురుస్తున్న వర్షాలు సాగుపై భరోసా కల్పిస్తున్నాయి. ఈసారి జూన్‌ నెల నుంచే సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ నమోదైంది. జూలై నెలలో కూడా ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయి.

ఆశల సాగు

వరుణుడి కరుణతో మెట్ట రైతు జోరు

వరి నాట్లకే అన్నదాతల మొగ్గు

60 వేల ఎకరాల్లో నాట్లు వేస్తారని అంచనా

24 వేల ఎకరాల్లో పత్తి 

గణనీయంగా తగ్గిన మొక్కజొన్న సాగు


హుస్నాబాద్‌, జూలై 5 : నిత్యం కరువుతో విలవిలలాడుతూ వ్యవసాయంపై ఆశలు వదులుకున్న హుస్నాబాద్‌ ప్రాంత రైతాంగానికి రెండేళ్లుగా మంచిరోజులు వచ్చాయి. సంవత్సరాల నుంచి సకాలంలో కురుస్తున్న వర్షాలు సాగుపై భరోసా కల్పిస్తున్నాయి. ఈసారి జూన్‌ నెల నుంచే సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ నమోదైంది. జూలై నెలలో కూడా ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయి. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 117 మిల్లిమీటర్లు కాగా.. ఈసారి 196 మిల్లిమీటర్లుగా నమోదైంది. దీంతో గతానికి భిన్నంగా సీజన్‌ ప్రారంభంలోనే వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గత సీజన్‌లో పత్తికి మునుపెన్నడూ లేనంత ధర రావడంతో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో జోరుగా పత్తి విత్తనం వేసుకుంటున్నారు. అలాగే, శనిగరం ప్రాజెక్టులోనూ నీటి వనరులు అశాజనకంగా ఉండటంతో ఆయకట్టులో నాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు చెరువులు, కుంటలు, బావుల్లోనూ నీరు ఉండటంతో రైతులు వరివైపే మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న సాగు తగ్గిపోయింది. 


సాగు అంచనా 1.30 లక్షల ఎకరాలు

హుస్నాబాద్‌ డివిజన్‌లో గత ఖరీఫ్‌ కంటే ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డివిజన్‌లోని హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట, మద్దూరు మండలాల్లో 1,60,612 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నది. గతేడాది వానాకాలం సీజన్‌లో 1.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి ఇప్పటి వరకు డివిజన్‌లో 16,600 ఎకరాల్లో పత్తి, 1,100 ఎకరాల్లో వరి, 600 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం వేసుకున్నారు. మరో 7 వేల ఎకరాలకు పైగా పత్తి, 60 వేల ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వానాకాలం ప్రారంభంలోనే వర్షాలు పడుతుండటం, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా పత్తి విత్తనం వేసుకుంటున్నారు. గతంలో మొక్కజొన్న సాగుపై అసక్తిని కనబర్చే ఈప్రాంత రైతులు ప్రస్తుతం విముఖత చూపుతున్నారు. ఆడవి పందులు, కోతుల బెడదతో మొక్కజొన్న సాగును పూర్తిగా తగ్గించారు. వరుణుడు కరుణించి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా గట్టెక్కిస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు ఆశిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తే తమకు మెట్ట కష్టాలు తప్పుతాయని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-07-06T05:51:29+05:30 IST