జాతీయ లోక్‌అదాలత్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-06-26T05:51:15+05:30 IST

సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

జాతీయ లోక్‌అదాలత్‌కు ఏర్పాట్లు పూర్తి
పోస్టర్లను విడుదల చేస్తున్న న్యాయమూర్తులు

జిల్లా వ్యాప్తంగా 11 బెంచ్‌లు

 సంగారెడ్డి క్రైం, జూన్‌ 25: సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. క్రిమినల్‌ కాంపౌండేబుల్‌, చెక్‌ బౌన్స్‌ కేసులు, బ్యాంకు రికవరీ, మోటార్‌ వాహన ప్రమాద నష్టపరిహారం, కుటుంబ తగాదాలు, భూసేకరణ తదితర కేసులతో పాటు రాజీకి అనువైన కేసులన్నీ పరిష్కరిచుకొనేందుకు న్యాయమూర్తులు, పోలీసులు న్యాయవాదులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇప్పటికే కక్షిదారులకు చైతన్యవంతం చేశారు. ఆదివారం జరుగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం కొత్తగా ఏర్పాటైన జిల్లా కోర్టుల వారీగా నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 7, నారాయణఖేడ్‌, జోగిపేటలో ఒకటి చొప్పున, జహీరాబాద్‌లో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేసి లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించనున్నారు. సంగారెడ్డిలో జరిగే లోక్‌ అదాలత్‌లో మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి చెందిన భూనిర్వాసితులకు రూ. 1.08 కోట్ల పరిహారం అందించనున్నారు. ప్రజలు వివిధ కేసులకు సంబంధించి న్యాయస్థానాల చుట్టూ తిరుగకుండా జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి సూచించారు. 


23,676 కేసులు పరిష్కారం 

సంగారెడ్డి జిల్లా కోర్టులో మార్చి 12న నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 23,676 కేసులను పరిష్కరించారు. ఇందులో భూసేకరణకు సంబంధించి 2 కేసుల్లో భూములు నష్టపోయిన నిర్వాసితులకు జాతీయ లోక్‌ అదాలత్‌లో రూ.11,52,69,190  పరిహారం ఇప్పించారు. 42 మోటార్‌ వాహన ప్రమాద నష్ట పరిహారం కేసులు పరిష్కరించి రూ.2,26,98,000 బాధితులకు అందజేశారు. 80 సివిల్‌ కేసులు, 20,693 క్రిమినల్‌ కాంపౌండేబుల్‌ కేసులు పరిష్కరించారు. 145 బ్యాంకు రికవరీ కేసులను పరిష్కరించి రూ.1,03,93,558 రికవరీ చేశారు. 6 బీఎ్‌సఎన్‌ఎల్‌ రికవరీ కేసులు పరిష్కరించి రూ 28,589 రికవరీ చేయగా, 108 లిటిగేషన్‌ కేసులు, 2,600 విద్యుత్‌ చౌర్యం కేసులు పరిష్కరించారు. 


సమన్వయ సమావేశం

సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి జిల్లా కోర్టులో శనివారం జిల్లా న్యాయమూర్తులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్‌ 26న  నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ పెండింగ్‌ కేసులు పరిష్కరించుకునే విషయంలో కక్షిదారులకు అవగాహన కలిగించాలన్నారు. లోక్‌ అదాలత్‌లో అవార్డు పొందిన కేసులు కోర్టు జడ్జిమెంట్‌తో సమానమని తెలిపారు. సమావేశం అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సుదర్శన్‌, మూడవ అదనపు జిల్లా జడ్జి పి.రాజు, సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌.ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి అబ్దుల్‌ జలీల్‌, స్పెషల్‌ ఎక్సైజ్‌ కోర్టు జడ్జి జె.హన్మంతరావు, మొబైల్‌ కోర్టు జడ్జి ఎ.నిర్మల, అదనపుప్రథమ శ్రేణి జడ్జి పి.తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-06-26T05:51:15+05:30 IST