వచ్చే ఎన్నికల్లో అన్నింటా గెలుపు మాదే

ABN , First Publish Date - 2022-01-29T04:38:31+05:30 IST

వచ్చే శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలోని ఐదింటికి ఐదు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ధీమాగా చెప్పారు

వచ్చే ఎన్నికల్లో అన్నింటా గెలుపు మాదే
చింతా ప్రభాకర్‌

సంధానకర్తగా పని చేస్తా

కాంగ్రెస్‌, బీజేపీకి గెలిచే సత్తా లేదు

ప్రజలే దేవుళ్లు.. అంతిమతీర్పు ఓటు

‘ఆంధ్రజ్యోతి’తో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌


 ఆంధ్రజ్యోతిప్రతినిధి,సంగారెడ్డి, జనవరి 28: వచ్చే శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలోని ఐదింటికి ఐదు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ధీమాగా చెప్పారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారిగా జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ప్రభాకర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అధినేతకు, కార్యకర్తలకు నడుమ సంధానకర్తగా ఉంటూ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. 

 మొదటిసారి జిల్లా అధ్యక్షుడయ్యారు. ఎలా ఫీలవుతున్నారు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమితులవడం సంతోషంగా ఉన్నది. పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తా. అధినేతకు, కార్యకర్తకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తా.

 సంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది ? 

 జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సంగారెడ్డి తప్ప, నాలుగింటిలో పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేలందరూ సమర్థులు. సమర్థవంతంగా పని చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కడైనా సమ స్య ఉంటే పార్టీని మరింత మెరుగు పరచడానికి ప్రయత్నిస్తా. చిత్తశుద్ధితో పని చేసిన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది.

 కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామన్నారు కదా?

 నిజమే. చేనేత, జౌళి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు కదా. అయినా ప్రొటోకాల్‌ ఇబ్బందులు లే కుండా చేస్తామని నాయకత్వం తెలిపింది.

 కాంగ్రెస్‌, బీజేపీలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళతారు?

 ఆయా పార్టీలను పోల్చుకునే పరిస్థితులలోనే మేం లేము. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్‌, బీజేపీ సొంత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. మేము అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు వంటి కార్యక్రమా లు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. బీజేపీ అయితే దేశవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు, జనధన్‌ ఖాతాలో రూ.15లక్షల చొప్పున వేస్తామని మాట తప్పారు. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ను తిట్టిన తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు ఆయన కాంగ్రె్‌సలో చేరగానే ఆ పార్టీ పునీతమైందా?

 పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీజేపీలు లేవా ?

 బీజేపీ గొడవలు సృష్టించి, ముందుకు పోవాలన్న ఆలోచనతో ఉన్నది. కాంగ్రెస్‌ అయితే ఆ పార్టీలోనే గొడవలు జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు ఎన్నికలలో గెలిచేంత సీన్‌ లేదు.  ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరు. ఏమైనా ప్రజలు అంతిమ తీర్పు ఓటు ద్వారా నిర్ణయిస్తారు. ప్రజాదేవుళ్ల తీర్పు మేరకు ఎవరైనా నడుచుకోవాల్సిందే.

Read more