ఆగ్రహజ్వాల

ABN , First Publish Date - 2022-12-07T00:34:21+05:30 IST

పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ శిలాసాగరం రమేశ్‌ మృతికి సంఘీభావంగా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రమేశ్‌ బలవన్మరణానికి కారణమైన సిద్దిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌ను వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఆగ్రహజ్వాల
సిద్దిపేటలోని కౌన్సిలర్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు ఫ్లెక్సీని దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

రమేశ్‌ ఆత్మహత్యపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

అహ్మదీపూర్‌లో ముగిసిన రమేశ్‌ అంత్యక్రియలు

హాజరైన బీజేపీ, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు

కౌన్సిలర్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌

రాజనర్సు ఫ్లెక్సీని దహనం చేసిన కాంగ్రెస్‌ నేతలు

మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు

అనవసర రాద్ధాంతం తగదన్న టీఆర్‌ఎస్‌

కౌన్సిలర్‌ ప్రవీణ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు

అరెస్టుకు రంగం సిద్ధం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 6: పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ శిలాసాగరం రమేశ్‌ మృతికి సంఘీభావంగా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రమేశ్‌ బలవన్మరణానికి కారణమైన సిద్దిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌ను వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం రమేశ్‌ అంత్యక్రియలు ముగిశాయి. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌, నర్సారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. సిద్దిపేటలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్‌ ప్రవీణ్‌ ఫ్లెక్సీకి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిప్పటించి నిరసన తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. శవ రాజకీయాలు తగవని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరించారు.

వైరల్‌గా మరో వీడియో

రమేశ్‌ సూసైడ్‌ సెల్ఫీ వీడియోను మరువకముందే గతంలో రమేశ్‌ మాట్లాడిన మరో వీడియో స్థానికంగా వైరల్‌ అయ్యింది. తనకు మూడుసార్లు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరైనప్పటికీ కౌన్సిలర్‌ ప్రవీణ్‌ కక్షగట్టి అడ్డుకున్నాడని ఆరోపించాడు. తనకు ఇల్లు కేటాయించిన విషయాన్ని స్వయంగా మున్సిపల్‌ అధికారులే ఫోన్‌ చేసి చెప్పారని వివరించాడు. తన కుటుంబానికి ప్రవీణ్‌ అన్యాయం చేశాడని, ఇక చనిపోతాననే ఆవేదనతో వీడియోలో బాధ వెళ్లగక్కాడు. తనకు మంజూరైన డబుల్‌బెడ్‌రూం ఇంటి వివరాలను వీడియోలో ఆధారాలతో చూపించాడు.

నాన్‌బెయిలబుల్‌ కేసు

తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దిపేట మున్సిపల్‌ 26వ వార్డు కౌన్సిలర్‌ కెమ్మసారం ప్రవీణ్‌ కారణమని మృతుడు రమేశ్‌ భార్య లలిత సోమవారం రాత్రి త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ వద్ద ప్రవీణ్‌ రూ.లక్ష తీసుకుని ఇవ్వకపోవడంతోపాటు గొడవ పెట్టుకున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నది. ఈ మేరకు సెక్షన్‌ 306 కింద నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో పాటు మృతుడి సెల్ఫీ వీడియోను ఆధారాలుగా చేసుకుని ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై త్రీటౌన్‌ సీఐ భానుప్రకాశ్‌ విచారణ ప్రారంభించారు. నేడో రేపో కౌన్సిలర్‌ ప్రవీణ్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

కౌన్సిలర్‌ ప్రవీణ్‌ను బర్తరఫ్‌ చేయాలి

సిద్దిపేట టౌన్‌: ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన సిద్దిపేట మున్సిపల్‌ 26వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌ను బర్తరఫ్‌ చేయాలని సిద్దిపేట కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌, కాంగ్రెస్‌ నాయకులు దరిపల్లిచంద్రం, బొమ్మల యాదగిరి డిమాండ్‌ చేశారు. రమేశ్‌ మృతికి కారణమైన కెమ్మసారం ప్రవీణ్‌, మున్సిపల్‌ మాజీచైర్మన్‌ కడవెరుగు రాజనర్సు ఫ్లెక్సీలను కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ ఆధ్వర్యంలో మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హుల జాబితాలో పేరు వచ్చినా, అప్పు చేసి కౌన్సిలర్‌కు డబ్బు ఇచ్చినా కూడా డబుల్‌బెడ్‌రూం ఇల్లు దక్కకపోవడంతో విసుగుచెందిన రమేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చికిత్స పొందుతూ మరణించిన రమేశ్‌ మృతదేహానికి రాత్రికి రాత్రే పోస్టుమార్టం చేసి ఆయన గ్రామానికి అధికారులు ఎలా తరలిస్తారని మండిపడ్డారు. రమేశ్‌ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించి, పోలీ్‌సస్టేషన్‌ ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. ఆందోళన చేసిన వారిలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, సూర్య వర్మ, కలీమొద్దిన్‌, సయ్యద్‌ ఆతీక్‌, అజ్జూ యాదవ్‌, గ్యాదరి మధు, సలీం, అనిల్‌, సుంచు రమేశ్‌, స్వప్న, నర్సవ్వ, హసునుద్దిన్‌ తదితరులు ఉన్నారు.

కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

సిద్ధిపేట క్రైం: రమేశ్‌ మృతికి కారణమైన సిద్దిపేట మున్సిపల్‌ 26వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ మాజీచైర్మన్‌ రాజనర్సును వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రమేశ్‌ మృతికి కారణమైన వారిని ఇంకా అరెస్టు చేయకపోవడం వెనుక హరీశ్‌రావు హస్తం ఉందని ఆరోపిస్తూ మంగళవారం సిద్దిపేటలోని జగ్జీవన్‌రామ్‌చౌరస్తా వద్ద మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, గుండ్ల జనార్దన్‌, కొత్తపల్లి వేణు, సురేష్‌ గౌడ్‌, శివకుమార్‌, బైరి శంకర్‌, సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్‌, యాదన్‌రావు, వెంకట్‌, యాదగిరి, లింగం ఉన్నారు.

అవాస్తవాలు మాట్లాడితే రఘునందన్‌రావు తోలుతీస్తాం

సిద్దిపేటటౌన్‌: శవ రాజకీయాలు చేస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తామని టీఆర్‌ఎస్‌ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండం సంపత్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం మాట్లాడారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అధికారులు అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు రమేశ్‌కు ఇల్లు అందజేస్తామని చెప్పారని, అంతలోనే క్షణికావేశంలో రమేశ్‌ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. మృతునికి అతని స్వగ్రామంలో ఇల్లు, ఆటో ఉందని, అంతేకాకుండా అతని భార్య అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో గజ్వేల్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుందని, అది కూడా మంత్రి హరీశ్‌రావు మానవతా దృక్పథంతో ఉద్యోగం కల్పించినట్లు వివరించారు. మృతి చెందిన రమేశ్‌ కుటుంబానికి మంత్రి హరీశ్‌రావు అండగా ఉంటారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ శవ రాజకీయాలు చేస్తే చూస్తు ఊరుకోమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్‌, నాగరాజు, నాయకం లక్ష్మణ్‌, బ్రహ్మం, సాయిశ్వర్‌ గౌడ్‌, నాయకులు లోక లక్ష్మిరాజ్యం, సాకి ఆనంద్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

అశ్రునయనాల మధ్య రమేశ్‌ అంత్యక్రియలు

గజ్వేల్‌: శిలాసాగరం రమేశ్‌ అంత్యక్రియలు అతని స్వగ్రామమైన గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ నాయకుడు ఆకుల ప్రభాకర్‌, ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చక్రధర్‌గౌడ్‌ రమేశ్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. 15ఏళ్ల క్రితం గ్రామం నుంచి సిద్దిపేటకు బతుకుదెరువు కోసం వెళ్లిన రమేశ్‌ ఆత్మహత్యకు పాల్పడి విగతజీవిగా సొంతగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-12-07T00:34:22+05:30 IST