మళ్లీ తెరపైకి కొత్త డివిజన్‌, మండలం

ABN , First Publish Date - 2022-12-19T23:53:11+05:30 IST

మెదక్‌ జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్‌, మండలం కోసం ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమకు అన్యాయమే జరిగిందని రామాయంపేట, కొల్చారం మండలం రంగంపేటవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ తెరపైకి కొత్త డివిజన్‌, మండలం
రెవెన్యూ డివిజన్‌ సాధన ఉద్యమానికి రామాయంపేట ప్రజల మద్దతు కోరుతున్న జేఏసీ నేతలు

రెవెన్యూ డివిజన్‌గా రామాయంపేట, మండలంగా రంగంపేటను ఏర్పాటు చేయాలని కొనసాగుతున్న ఆందోళనలు

ఉద్యమ బలోపేతానికి జేఏసీ ఏర్పాటు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు 19: మెదక్‌ జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్‌, మండలం కోసం ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమకు అన్యాయమే జరిగిందని రామాయంపేట, కొల్చారం మండలం రంగంపేటవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలున్న రామాయంపేట, రంగంపేట విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అంజయ్య ప్రాతినిధ్యంతో రామాయంపేటకు గుర్తింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన టి.అంజయ్య రామాయంపేట నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంజయ్య సీఎం కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో రామాయంపేటకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని ఈ ప్రాంత వాసులు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రామాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది. దీంతో రామాయంపేట ప్రభావం కోల్పోయింది. కాగా రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా రామాయంపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అధికార బీఆర్‌ఎస్‌ నేతలను కలిసి రెవెన్యూ డివిజన్‌ చేయాలని అఖిలపక్ష నేతలు ఒత్తిడి తెచ్చారు. రామాయంపేటలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

కలిసొచ్చిన నేషనల్‌ హైవే

రామాయంపేట పట్టణం హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఉండడం బాగా కలిసి వచ్చింది. చుట్టు పక్కల అనేక గ్రామాలకు కేంద్రబింధువుగా ఉండడంతో వ్యాపార, వాణిజ్య రంగంలో అభివృద్ధి సాధించింది. ఈ క్రమంలోనే రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండలాలను కలిపి రామాయంపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న డిమాండ్‌. రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యంగా ఉద్యమాలు చేశారు. 2017, 2018లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు కూడా అందజేశారు. ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకోలు, వంటావార్పు, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు వంటి ఆందోళన కార్యక్రమాలతో హోరెత్తించారు. వివిధ పార్టీలు, కుల, యువజన, విద్యార్థి, వ్యాపార సంఘాలన్నీ ఏకమై డివిజన్‌ కేంద్రం సాధన కోసం 183 రోజుల పాటు రిలే దీక్షలు కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రభుత్వం పలు కొత్త డివిజన్లను ప్రకటించినా అందులో రామాయంపేటకు చోటు దక్కకపోవడం బాధాకరం. కాగా రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కోసం జరుగుతున్న మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు జేఏసీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఇంటింటా, దుకాణాల్లో కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు 28 నుంచి నిరాహార దీక్షలు చేపట్టేందుకు ప్లాన్‌ చేశారు.

రంగంపేట డిమాండ్‌ పాతదే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో మండల వ్యవస్థ ఏర్పాటైంది. అదే సమయంలో రంగంపేట కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేశారు. రంగంపేటలో మండల కార్యాలయాలు కూడా ఏర్పాటయ్యాయి. కాగా కొల్చారం గ్రామస్థులు అప్పట్లో ఆందోళన చేపట్టి రాష్ట్ర రాజధాని ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశారు. దీంతో రంగంపేట నుంచి మండల కేంద్రం కొల్చారం గ్రామానికి మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ సమయంలో రంగంపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్‌ చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ప్రభుత్వం పలు కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో రంగంపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఆందోళనకు సిద్ధం అవుతుండగా ఇటీవల దళిత సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తమ డిమాండ్‌ నెరవేర్చుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నారు.

Updated Date - 2022-12-19T23:53:12+05:30 IST