టిఫా స్కాన్‌పై ప్రచారం చేయండి

ABN , First Publish Date - 2022-11-27T00:05:50+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా టిఫా స్కాన్‌ యంత్రాలు ప్రారంభం

 టిఫా స్కాన్‌పై ప్రచారం చేయండి
సిద్దిపేట ఆసుపత్రిలో టిఫా స్కానింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

సంగారెడ్డి అర్బన్‌/సిద్దిపేట టౌన్‌/గజ్వేల్‌, నవంబరు 26: సర్కారు దవాఖానాల్లో టిఫా స్కాన్‌ చేస్తారని తెలిసేలా ఆస్పత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రచారం నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌కు మంజూరైన రెండు టిఫా స్కానింగ్‌ యంత్రాలను, సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్‌ యంత్రాలను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌ వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గర్భిణులకు ఐదు నెలల్లో చేసే టిఫా స్కాన్‌ కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లకుండా ప్రభుత్వం అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది కష్టపడుతూ సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. రెఫర్‌ కేసులకు కూడా టిఫా స్కాన్‌ చేయాలని సూచించారు. దాతలు ఇచ్చిన ఎయిర్‌ ఫిల్టర్లను ఆస్పత్రులకు పంపుతున్నామని, దాంతో ఆపరేషన్‌ థియేటర్లలో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ రేటు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20కోట్ల వ్యయంతో 44టిఫా స్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీ, డీఐవో డాక్టర్‌ శశాంక్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ రవికుమార్‌, గైనిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ రాధిక, రేడియాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ వీణ పాల్గొన్నారు. గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గోపాల్‌రెడ్డి, ఉమర్‌, అహ్మద్‌, గడియారం స్వామిచారీ పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అనుబంధ మెడికల్‌ కళాశాలలో జడ్పీ చైర్‌పర్సన్‌రోజాశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ విమలా థామస్‌, సూపరింటెండెంట్‌ కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T00:05:51+05:30 IST