వీఆర్వో పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి
ABN , First Publish Date - 2022-08-04T05:45:30+05:30 IST
రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసిన వీఆర్వోల వ్యవస్థ పూర్తిగా తొలగించేందుకు సర్కారు రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకున్నది.
మెదక్ జిల్లాలో 145 మంది 24 శాఖల్లోకి
సంగారెడ్డి జిల్లాలో 231 మంది 32 శాఖల్లోకి
మెదక్అర్బన్, ఆగస్టు 3: రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసిన వీఆర్వోల వ్యవస్థ పూర్తిగా తొలగించేందుకు సర్కారు రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకున్నది. ఇకపై విలేజ్ రెవెన్యూఆఫీసర్(వీఆర్వో)లు ఉండబోరని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020 సెప్టెంబరులో వ్యవస్థ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ రోజు నుంచే వారిని భూసంబంధిత విధులకు ప్రభుత్వం దూరం పెట్టింది. సమాన అర్హతస్థాయిలో ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రకియ జరగలేదు. వారంతా రెవెన్యూశాఖలోనే ఉంటూ తహసీల్దార్లు అప్పగించిన పనులు కాకుండా.. ధ్రువపత్రాలు, లబ్ధిదారుల ఎంపిక కోసం పరిశీలన సహా ఇతర విధులు నిర్వర్తించారు. 22 నెలలుగా వీఆర్వోలకు ఎలాంటి విధులు కేటాయించకపోవడమే కాకుండా ఇతర శాఖకు కూడా బదిలీ చేయలేదు. ఈ నేపథ్యంలో వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ గతనెల 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే అధికారాన్ని కలెక్టర్కు అప్పగించింది. జిల్లాలో వివిధ శాఖల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను గుర్తించి వీఆర్వోలను లాటరీ ద్వారా కేటాయించాలని ఆదేశించింది.
లాటరీ పద్ధతిలో
మెదక్ జిల్లాలో వీఆర్వోలను ఆయాశాఖలకు సర్దుబాటు చేశారు. కలెక్టర్ హరీశ్ సమక్షంలో ఈనెల 1న సోమవారం లాటరీ పద్ధతిన 24 శాఖలకు 145 మంది వీఆర్వోలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారిని రిలీవ్ చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఎట్టకేలకు విధుల్లోకి
మెదక్ జిల్లాలో 145 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా సోమవారం నియమించారు. అయితే మొదట బదిలీ ఆర్డర్లు తీసుకునేందుకు ముందుకు రాలేదు. తాజాగా జారీ చేసిన జీవో 121 మేరకు వీఆర్వోలను సీనియార్టీని, విద్యార్హతలను పరిగణలోకి తీసుకోకుండా, ఆప్షన్లు ఇవ్వకుండా హడవుడిగా లాటరీ పద్ధతిలో ఆయా శాఖల్లో తమను సర్దుబాటు చేయడంపై వీఆర్వోలు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బుధవారం 145 మంది వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్ హోదాలో విధుల్లోకి చేరారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డిటౌన్, ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లాలో వీఆర్వోలకు ఆయా శాఖల్లో పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని 231 మంది వీఆర్వోలను 32 శాఖల్లో సర్దుబాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శరత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్, ఇంటర్మీడియట్ బోర్డు, డ్వామా, వైద్యఆరోగ్యశాఖ తదితర 32 శాఖలకు కేటాయించారు. ఉత్తర్వులు అందుకున్న వీఆర్వోలు వారికి కేటాయించిన శాఖల్లో విధుల్లో చేరారు. దాదాపు రెండేళ్ల క్రితం వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయగా, ఇప్పటి వరకు పోస్టులను సర్దుబాటు చేయకపోవడంతో రెవెన్యూశాఖలోనే కొనసాగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ శరత్ వీఆర్వోలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేశారు.