ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం కోసం చర్యలు

ABN , First Publish Date - 2022-07-06T05:02:28+05:30 IST

ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తక్షణమే స్పందించి కేసులు నమోదు చేసి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు.

ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం కోసం చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌ అర్బన్‌, జూలై 5: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తక్షణమే స్పందించి కేసులు నమోదు చేసి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి ప్రాథమికంగా 25 శాతం నష్టపరిహారం ఇప్పించాలన్నారు. కేసును 60 రోజుల్లోగా పరిష్కరించకపోతే బలహీనపడే అవకాశముందని, చార్జ్‌షీట్‌ దాఖలు చేసి క్లియర్‌గా విచారణ చేయాలన్నారు. కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ... 2019 నుంచి ఎస్సీ, ఎస్టీ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు నమోదైన 125 కేసులకు గాను 104 కేసులపై చార్జ్‌షీట్‌ దాఖలైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల 21 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. 121 మంది బాధితులకు రూ. 1,61,76,000 నష్టపరిహారం అందించామన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిణీప్రియదర్శిని, అదనపు కలెక్టర్‌ రమేష్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


జిల్లాలో అర్బన్‌ పార్కుల అభివృద్ధి:  కలెక్టర్‌ హరీశ్‌

 జిల్లాలో అర్బన్‌ పార్కుల అభివృద్ధితోపాటు 23 హరిత వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో హరిత వనాల ఏర్పాట్లు, అడవుల పునరుద్ధరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ వానా కాలంలో వివిధ శాఖల ద్వారా 34 లక్షల మొక్కలను నాటడంతోపాటు అదనంగా అటవీ శాఖ ద్వారా 13.39 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించామన్నారు. ప్రభుత్వం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అధికారులు ఎవరూ అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తూ.. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్టు శరవణన్‌ మాట్లాడుతూ..  హరితహారం ద్వారా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 6.5 శాతం విస్తరించాయన్నారు. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో దట్టమైన అడవుల పెంపకానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయన్నారు. మీటరు దూరంలో మొక్క చొప్పున నాటేందుకు ప్రణాళికతో పాటు అర్బన్‌ పార్కులు, దాని చుట్టుపక్కల అర్బన్‌ బ్లాక్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నాటేందుకు 26 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో డీఎ్‌ఫవో రవి ప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read more