దొంగతనం కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-04T06:10:43+05:30 IST

దొంగతనం కేసులో నిందితులను అరెస్టుచేసి చోరీకి గురైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనం కేసులో నిందితుల అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ రామక్రిష్ణారెడ్డి

నారాయణఖేడ్‌, ఆగస్టు 3: దొంగతనం కేసులో నిందితులను అరెస్టుచేసి చోరీకి గురైన నగలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. నారాయణఖేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం సీఐ రామక్రిష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు..  మండలంలోని జూకల్‌కు చెందిన మల్లేశం గత నెల 29న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లారు.  సాయంత్రం  వారు పొలం నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరచి ఉన్నాయి.  బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు నగలు, రూ.30 వేలు దొంగతనానికి గురైనట్లు బాధితులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.  మంగళవారం నారాయణఖేడ్‌ పోలీసులు ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలోని భవానీమందిర్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు పారిపోయేందుకు యత్నించగా సిబ్బంది వెంబడించిపట్టుకున్నారు.  నిందితుల వద్ద ఆరు తులాల బంగారు నగలు, రూ.వెయ్యి నగదు లభించింది.  నిందితులు జూకల్‌కు చెందిన సుంకి నర్సింహులు, లింగాపూర్‌నరేష్‌, ఓ మైనర్‌ బాలుడితో కలిసి మల్లేశం ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. నిందితుల్లో ఇద్దరిని కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించగా, మైనర్‌బాలుడిని బాల నేరస్తుల కారాగారానికి తరలించామన్నారు.  సమావేశంలో స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-08-04T06:10:43+05:30 IST