ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-12-16T00:00:02+05:30 IST

2023 జనవరి1 నుంచి 120 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ను నిషేధించారని, ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

  • 120 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం

  • జనవరి 1 తర్వాత నుంచి వినియోగిస్తే జరిమానా

  • అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి

  • అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 15 : 2023 జనవరి1 నుంచి 120 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ను నిషేధించారని, ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజామిల్‌ఖాన్‌ మాట్లాడారు. జిల్లాలో 41 ప్రభుత్వ, 230 ప్రైవేట్‌ ఆసుపత్రులున్నాయని చెప్పారు. ఆసుపత్రుల నుంచి వెలువడే జీవ వ్యర్థ పదార్థాలు చాలా హానికరమైనవన్నారు. వాటిని నాలుగు విభాలుగా (జీవ శరీర వ్యాప్త పదార్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, గ్లాస్‌ వ్యర్థాలు, పదునైన నిడిల్స్‌, సీజర్స్‌, తదితర) ఆసుపత్రిలోనే వేరు చేసి చిన్నకోడూరులోని జీవ వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ ప్లాంట్‌కు తరలించాలని సూచించారు. ప్రతీ ఆసుపత్రిలో జీవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియమించాలని సూచించారు. పశు వైద్యశాలల నుంచి వెలువడే జీవవ్యర్థ పదార్థాలను కూడా క్రమపద్ధతిలో శుద్ధీకరణ చేయాలని చెప్పారు. ప్టాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్‌ ప్రకారం జనవరి 1 నుంచి తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను ఉపయోగించడం నిషేధమని సూచించారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ అధికారులు, గ్రామాల్లో ఎంపీడీవోలు ప్లాస్టిక్‌ నియంత్రణపై వ్యాపారులు, ఫంక్షన్‌హాల్‌ యజమానులు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్ధాలు, నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే విధించే జరిమానా, అవగాహన కల్పిస్తూ షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు, రెస్టారెంట్లు, మటన్‌, చికెన్‌సెంటర్లు, హోటళ్ల వద్ద పోస్టర్లను అతికించాలన్నారు. చిరు ప్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు అవగాహన కల్పించాలని అన్నారు. జనవరి 1 నుంచి నిషేధిత ప్లాస్టిక్‌ వాడితే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి కంపోస్టు ఎరువును తయారు చేయాలని చెప్పారు. సమావేశంలో తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్‌ ఎన్విరాన్మెంట్‌ సైంటిస్ట్‌ రవీందర్‌, డీఆర్డీవో గోపాలరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కాశీనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:00:03+05:30 IST