ఏడాదిలో 22,519 మందికి 3,32,797 పరీక్షలు
ABN , First Publish Date - 2022-03-06T05:13:26+05:30 IST
అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ముందుగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ టెస్టులకు అయ్యే ఖర్చు రూ.వేలల్లో ఉంటుంది. పేద, మధ్యతరగతి వారు చేసేదేమీ లేక అప్పులు తెచ్చీ మరీ పరీక్షలు చేయించుకుంటారు. అది కూడా లేని కొందరు మాత్రలతో కాలం వెళ్లదీస్తారు.
ఉచితంగా 57 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు
పీహెచ్‌సీలలో శాంపిల్స్ సేకరణ, ల్యాబ్‌లలో టెస్టులు
ఒక్కరోజులోనే ‘ఎస్‌ఎంఎస్’ ద్వారా రిపోర్టు
మెదక్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటై నేటితో ఏడాది పూర్తి
మెదక్ కల్చరల్, మార్చి 5: అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ముందుగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ టెస్టులకు అయ్యే ఖర్చు రూ.వేలల్లో ఉంటుంది. పేద, మధ్యతరగతి వారు చేసేదేమీ లేక అప్పులు తెచ్చీ మరీ పరీక్షలు చేయించుకుంటారు. అది కూడా లేని కొందరు మాత్రలతో కాలం వెళ్లదీస్తారు. పేదలకు మంచి వైద్యం, కార్పొరేట్ స్థాయిలో టెస్టులు చేసేలా ఏడాది క్రితం మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. 54 రకాల వైద్యపరీక్షలను ఒకే చోట చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేసింది. రూ.కోట్ల విలువ చేసే అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. డయాగ్నోస్టిక్ సెంటర్లలో రోజు వ్యవధిలోనే పరీక్షలను నిర్వహించి ఫలితాలను ఎస్‌ఎంఎస్ ద్వారా రోగుల మొబైల్‌కు పంపించే సౌకర్యాన్ని కల్పించారు. పీహెచ్‌సీల్లో రక్తనమూనాలను సేకరించి హబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు దాదాపు 3వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగిన మిషన్లను అందుబాటులో ఉంచారు. ఈ డయాగ్నోస్టిక్ కేంద్రం అందుబాటులోకి రావడంంతో పేద ప్రజానీకానికి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి రోగ నిర్ధారణపరీక్షలు ఉచితంగా చేయించుకునే అవకాశం ఉంది. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ యూనిట్ల ద్వారా ప్రస్తుతం కంప్లీట్ బ్లడ్ పిక్చర్, డయాబెటిక్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ వంటి సుమారు 54 రకాల పరీక్షలు ఇక్కడే నిర్వహించే సౌకర్యం ఉంది.
పీహెచ్‌సీలలో శాంపిల్స్ సేకరణ
డయాగ్నోస్టిక్ హబ్‌లో శాంపిల్స్ సేకరించే అవకాశం లేదు. కేవలం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లకు మాత్రమే ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. రోజు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్‌సెంటర్లకు వచ్చే రోగులకు పరీక్షించి అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలకు నమూనాలు సేకరించి శాంపిల్స్‌ను ప్రత్యేక వాహనాల ద్వారా డయాగ్నోస్టిక్ హబ్‌కు తీసుకొస్తారు. వాటికి ఇక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్ట్‌లను ఆయా ప్రాథమిక కేంద్రాలకు మెయిల్‌కు పంపడంతో పాటు రోగికి లేదా రోగి సంబంధిత వ్యకి స్మార్ట్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా రిపోర్టును పంపిస్తారు. ఈ రిపోర్ట్స్ ఆధారంగా రోగులకు వైద్యసేవలందించే అవకాశం ఉంది.
24 గంటలు అందుబాటులో
డయాగ్నోస్టిక్ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రంలో పర్యవేక్షణకు ల్యాబ్ మేనేజర్‌తో పాటు 10 మంది శిక్షణ పొందిన టెక్నీషియన్లు ఉంటారు. వీరంతా మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్‌ల వల్ల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వైద్య పరీక్షలు ఇలా
ఏడాదిలో మెదక్ జిల్లాలో 22,519 మందికి 3,32,797 పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు ల్యాబ్ మేనేజర్ తెలిపారు. ఇందులో బయోకెమిస్ట్రీ-41,252, పాథాలజీ-7,994, మైక్రోబయాలజీ-5,500 పరీక్షలు నిర్వహించారు.
ప్రజలకెంతో ఉపయోగం
- పిప్పిరి చంద్రశేఖర్, మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్
తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌ల వల్ల ప్రజలకెంతో మేలు జరుగుతుంది. హబ్‌లలో నాణ్యతతో కూడిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల కచ్చితమైన రోగనిర్ధారణ వల్ల మెరుగైన చికిత్స చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల వైద్యం అందించడంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడం లేదు.
డయాగ్నోస్టిక్ హబ్‌లో ఎన్నో విలువైన పరీక్షలు
- ప్రజ్ఞా, ల్యాబ్ మేనేజర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లలో విలువైన పరీక్షలెన్నో నిర్వహిస్తారు. విలువైన పరీక్షల నిర్వహణ పరికరాలు ప్రభు త్వం సమకూర్చింది. సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ఖర్చులు తగ్గాయి
- ఎండీ సలీముద్దీన్
డయాగ్నోస్టిక్‌లో అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల పరీక్షలకు ఖర్చులు తగ్గాయి. లేకపోతే బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయిస్తే చాలా డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఇంతకు ముందు పట్టణాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని డబ్బులతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
