మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-07-01T05:51:09+05:30 IST
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహారం విషతుల్యం కావడంతో 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించిన ప్రధానోపాధ్యాయుడు
తల్లిదండ్రుల ఆగ్రహం... పాఠశాల వద్ద ఉద్రిక్తత
చిన్నశంకరంపేట, జూన్ 30: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహారం విషతుల్యం కావడంతో 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 135మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ప్రఽధానోపాధ్యాయుడు యాదగిరి వారికి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను మైరుగైన చికిత్స కోసం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణికి ఫోన్ చేయగా ఆసుపత్రి సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటుందని, మెదక్ ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. దీంతో సర్పంచ్ నీరజాపవన్గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఆటోలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. విద్యార్థులు మధ్యాహ్నం నుంచి వాంతులు చేసుకుంటున్నా ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయండమేంటని నిలదీశారు. పిల్లల ప్రాణాలంటే ఉపాధ్యాయులకు లెక్కలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడగా మధ్యాహ్న భోజనంలో చేసిన వంటలు తాము తిన్న అనంతరమే విద్యార్థులకు పెట్టామని తెలిపారు. మూడు రోజుల నుంచి పాఠశాలలో తాగేనీరు రాకపోవడంతో ఫిల్టర్ నీళ్లు తీసుకొచ్చామన్నారు. వంటనూనె కలుషితం కావడంతోనే ఫుడ్పాయిజన్ కావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని వారి తల్లిదండ్రులకు సూచించారు.