16 ఆస్పత్రులకు తాళం
ABN , First Publish Date - 2022-10-08T05:24:42+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 16 క్లినిక్‌లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సీజ్ చేసింది. మరో 20 క్లినిక్‌లకు రూ.1.90 లక్షలు జరిమానా విధించింది.
నిబంధనలు పాటించని 20 క్లినిక్‌లకు జరిమానా
17 ఆస్పత్రుల నుంచి రూ.1.90 లక్షలు వసూలు
ఇంకా జరిమానా చెల్లించని 3 దవాఖానాలు
అనుమతుల కోసం 35 ఆస్పత్రుల దరఖాస్తులు
ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, అక్టోబరు 7: సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 16 క్లినిక్‌లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సీజ్ చేసింది. మరో 20 క్లినిక్‌లకు రూ.1.90 లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గత నెల 21 నుంచి పది రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రులు, డయాగ్నోటిక్ సెంటర్లలో తనిఖీల కోసం 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని, నిబంధనలు పాటించని 70 క్లినిక్‌లు, ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ కేంద్రాలను గుర్తించారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ తనిఖీలు చేపట్టడానికి ముందు జిల్లాలో 347 వైద్యశాలలు కొనసాగాయి. వీటిలో 45 క్లినిక్‌లు, 46 పాలీక్లినిక్‌లు, 63 డయాగ్నొస్టిక్ కేంద్రాలు, 129 ఆస్పత్రులు, 52 డెంటల్ క్లినిక్‌లు, 12 ఫిజియోథెరపీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 16 ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 20 క్లినిక్‌లకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ జరిమానా విధించింది. ఒక్కో క్లినిక్‌కు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించారు. ఇందులో ఇప్పటి వరకు 17 క్లినిక్‌ల నుంచి రూ.1.90లక్షల జరిమానాను వసూలు చేసింది. మూడు క్లినిక్‌ల యాజమాన్యాలు ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించలేదు. జరిమానా చెల్లించని క్లినిక్‌లు జహీరాబాద్‌లో ఒకటి, బీరంగూడలో రెండు ఉన్నాయి. ఇవి రూ.45 వేలు జరిమానా చెల్లించాల్సి ఉన్నది.
అనుమతుల కోసం 35 దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో గుర్తించిన 70 క్లినిక్‌లలో 35 క్లినిక్‌ల యాజమాన్యాలు అనుమతుల కోసం జిల్లా వైద్యా ఆరోగ్యశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. వైద్యా ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆయా దరఖాస్తులను, క్లినిక్‌లను పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నాయి. దరఖాస్తులు చేసుకోకుండా, అనుమతులు పొందకుండా క్లినిక్‌లను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వైద్యాశాఖ వర్గాలు హెచ్చరించాయి.