జడ్పీ పీఠం ఎవరికో?

ABN , First Publish Date - 2022-12-16T23:15:18+05:30 IST

జడ్పీ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం రోజురోజుకు రక్తి కడుతోంది.

జడ్పీ పీఠం ఎవరికో?

- రేసులో ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్‌

- అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

- కేసీఆర్‌ దృష్టికి కొత్త జడ్పీ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం

- ఎమ్మెల్యేలతో మాట్లాడుతామన్న గులాబీ బాస్‌

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జడ్పీ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం రోజురోజుకు రక్తి కడుతోంది. ముగ్గురు సంతానం కేసులో దాదాపు మూడున్నర ఏళ్లపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగిన పద్మావతిపై అనర్హత వేటు పడడం, కోర్టు తీర్పు తర్వాత జరిగిన పరిణామాల్లో తెలకపల్లి జడ్పీటీసీగా కాంగ్రెస్‌కు చెందిన సుమిత్రను ప్రమాణ స్వీకారం చేయించడంతో కొత్త జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన నాగర్‌కర్నూల్‌ జడ్పీ చెర్మగా కొత్త వారిని నియమించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 22న ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే విధంగా షెడ్యూల్‌ రూపొందించింది. జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో అధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కొత్తగా జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు టీఆర్‌ఎస్‌లో ఇద్దరికి మాత్రమే ఉన్నాయి. కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్‌, ఊర్కొండ జడ్పీటీసీ సభ్యురాలు శాంతాకుమారికి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఊర్కొండకు చెందిన శాంతాకుమారి జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న ఊర్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మెజార్టీ జడ్పీటీసీ సభ్యులు ఆమెకు జడ్పీచైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌, ప్రస్తుత ఇన్‌చార్జి చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌ కూడా అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పడంతో పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని గులాబీ బాస్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. భరత్‌ జడ్పీ చైర్మన్‌గా ఎన్నిక కాకుండా పావులు కదుపుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని అధినేత నుంచి ఎంపీ రాములుకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ప్రతి కూలంగా ఉంటే దాదాపు నాలుగు నుంచి ఏడు మంది జడ్పీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తామని కూడా నిస్పష్టమైన సమాచారాన్ని అధిష్టానానికి లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-12-16T23:15:21+05:30 IST