పీయూపై చిన్నచూపు

ABN , First Publish Date - 2022-03-06T05:15:31+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి ప్రతీ ఏడాది తక్కువ నిధులు కేటాయిస్తూ చిన్నచూపు చూస్తున్నారని, ఈసారి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించాలని పీయూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

పీయూపై చిన్నచూపు
పీయూ వద్ద రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

తక్కువ నిధులు కేటాయించడంపై విద్యార్థుల రాస్తారోకో

రూ.300 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ 


 పాలమూరు యూనివర్సిటీ, మార్చి 5: రాష్ట్ర బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి ప్రతీ ఏడాది తక్కువ నిధులు కేటాయిస్తూ చిన్నచూపు చూస్తున్నారని, ఈసారి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించాలని పీయూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్‌ చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీయూలోని లైబ్రరీ నుంచి రాయచూర్‌ రహదారి వరకు ర్యాలీగా వచ్చి రహదారిపై బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ బడ్జెట్‌లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంటుతో పాటు, విద్యార్థులకు మెస్‌ బిల్లులు పెంచాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌ మెస్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రూరల్‌ ఎస్సై రమేష్‌ సిబ్బందితో వచ్చి విద్యార్థులకు సర్దిచెప్పి యూనివర్సిటీ ఆవరణలోకి పంపారు. అనంతరం విద్యార్థులు ర్యాలీగా వెళ్లి పీయూ అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు పవన్‌రెడ్డి, నాగరాజు, గౌస్‌, సీతారాం, రాము, ఐసి పవన్‌, మారుతి, రవితేజ, రవి, సాయి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:15:31+05:30 IST