ట్రా‘ఫికర్’
ABN , First Publish Date - 2022-01-18T05:03:32+05:30 IST
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో జనం సతమతమవుతున్నారు.

- మరో దారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
గద్వాల అర్బన్, జనవరి 17 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో జనం సతమతమవుతున్నారు. గద్వాల పట్టణం నుంచి రాయచూర్ వైపు వెళ్లే భారీ లారీలు, ఆర్టీసీ బస్సులు నిర్దేశిత మార్గంలో వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తుండడం అందుకు కారణమని చెప్పవచ్చు. రాయచూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పాతబస్టాండ్ నుంచి కూరగాయల మార్కెట్, పాత ఎస్బీహెచ్ రోడ్డు, రాంనగర్ మీదుగా వెళ్లి రాఘవేంద్రకాలనీ వద్ద ప్రధాన రహదారిని చేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా అటువైపు వెళ్లే ప్రయాణీకులు రథశాల ముందు వేచి ఉండడం చాలా కాలంగా కొనసాగుతున్న పద్ధతి. అలాగే పాతబస్టాండ్ సర్కిల్ వద్ద వాహనదారులు గందరగోళానికి గురికాకుండా అప్పటి ట్రాఫిక్ అధికారులు రోడ్డు డివైడర్ల మాదిరిగా సిమెంట్ దిమ్మెలను ఏర్పాటుచేసి రాకపోకలను క్రమబద్దీకరించారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా గాంధీ చౌక్ మీదుగా భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళ్తుండడం, అటు నుంచి భారీ వాహనాలు ఎదురుగా వస్తుండటంతో రాజావీధి, కళాశాల ముందు ప్రతీ రోజూ ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది.
ప్రయాణికులకు ఇబ్బందులు
ఆర్టీసీ బస్సులు రథశాల వైపు రాకుండా, వైఎస్ఆర్ విగ్రహం వెనుక భాగంలో కుడివైపు మళ్లి వెళ్తుండడంతో రాయచూరు వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రథశాల వద్ద వేచి ఉన్న ప్రయాణికులు బస్సులు ఇటువైపు వెళ్తుండడంతో, వాటిని అందుకునే ఆత్రుతలో రోడ్డు దాటుతుండటం ప్రమాదకరంగా మారింది. చేతిలో లగేజీతో పరుగెత్తు కుంటూ వచ్చే ప్రయాణికులు అడ్డంగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలబారిన పడుతు న్నారు. రాయచూరు బస్సుల రాక కోసం మరోవైపు ఉన్న బాలస్వామి డబ్బా, రాంనగర్ చౌరస్తాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండడం షరా మామూలుగా మారింది. వాళ్లు తిరిగి బస్టాండుకు చేరుకోవాలంటే 50 రూపాయలకు పైగా చెల్లించి ఆటోల్లో వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బంది పడలేక కొందరు ప్రైవేటు జీపులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బస్సులు పాత దారిలోనే వెళ్లేలా చర్యలు తీసుకోవా లని ప్రయాణికులు కోరుతున్నారు.
అధికారులు కఠినంగా వ్యవహరించాలి
రాఘవేంద్ర రెడ్డి, ప్రయాణికుడు, రాయచూర్ : రాయచూరుకు వెళ్లే బస్సులు విఽధిగా పాతమార్గంలోనే వెళ్లేలా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ట్రాఫిక్ పోలీసులు స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి
నరసింహులు, ప్రయాణికుడు, గద్వాల : రాయచూరు వైపు వెళ్లే లారీలు, ఆర్టీసీ బస్సులు గాంధీ చౌక్ మీదుగా వెళ్తుండడంతో రాజావీధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రథశాల వద్ద వేచి ఉండే ప్రయాణికులు బస్సుల కోసం పరిగెత్తుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారానికి ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలి.
కచ్చితమైన చర్యలు తీసుకుంటాం
ఎర్రవల్లి వైపు నుంచి పట్టణం మీదుగా రాయ చూరు వైపు వెళ్లే భారీ వాహనాలన్నీ ఆర్ఓబీపై నుంచి అయిజ వైపు వెళ్లి రింగ్ రోడ్డు గుండా వెళ్లేందుకు ఆయా మార్గాల్లో ఇప్పటికే సూచికలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సులు కూడా పాత కూరగా యల మార్కెట్, రాంనగర్, రాఘవేంద్ర కాలనీ మీదుగా, తిక్కసాబ్ దర్గా వద్ద రాయచూరు రోడ్డు లోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు కూడా సమాచారం, తగిన సూచనలు అందిస్తాం. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం.
- విక్రమ్, ట్రాఫిక్ ఎస్ఐ, గద్వాల