వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-11-30T23:46:09+05:30 IST

జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

గోపాల్‌పేట/మానవపాడు/జడ్చర్ల/కృష్ణ, నవంబరు 30: జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు వద్ద బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సుంకరి విజయకుమార్‌(41) మృతి చెందాడు. విజయ్‌ కుమార్‌, భార్య శివ పార్వతి అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను చూసేందుకు బైక్‌పై బయల్దేరారు. మానవపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విజయ్‌కుమార్‌ అక్కడికక్కడే చనిపోయాడు. శివపార్వతి ఎడమ కాలు విరిగిపోయింది. శివపార్వతిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరి కొడుకు రాహుల్‌ నాల్గో తరగతి, కూతురు వర్ణిక ఐదో తరగతి మాంటిస్సోరి పాఠశాలలో చదువుతున్నారు. మానవపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని

ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు పంచాయతీ పరిధిలోని టైరోడ్డు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా యడ్లపూర్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ (48) బైక్‌పై వెళ్తూ టైరోడ్డు చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టాడు. దాంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు దాటుతూ

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో రోడ్డు దాటుతున్న ఇందిరనగర్‌ కాలనీకి చెందిన సురేందర్‌(40)ను బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సురేందర్‌ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. ఘటనపై ఫిర్యాదు అందలేదని జడ్చర్ల పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-30T23:46:10+05:30 IST