‘ఎంఏఎల్‌డీ’ని పరిశీలించిన న్యాక్ బృందం
ABN , First Publish Date - 2022-08-18T04:47:41+05:30 IST
జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది.

- బృందాన్ని కలిసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సమావేశం
- కాలేజీలోని ప్రయోగశాలలు, డిపార్ట్మెంట్ల పరిశీలన
- సంస్థానాధీశుడు రాజా సీతారామ భూపాల్ బహుద్దూర్ విగ్రహావిష్కరణ
గద్వాల, ఆగస్టు 17 : జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందంలో ఛండీఘర్లోని మహారాజ యూనివర్సిటీ చైర్పర్సన్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ప్రకాష్గుప్తా, పంజాబ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ డాక్టర్ దమన్‌జిత్ సంధు, మహారాష్ట్ర సైన్స్ అండ్ ఆర్ట్స్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధనుంజయ్ తల్వాంకర్ ఉన్నారు. వారికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపతినాయుడు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వారు కోటలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. చిట్టుకింది అయ్యపురెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన గద్వాల సంస్థానాధీశుడు రాజా సీతారామ భూపాల్ బహుద్దూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కళాశాల ఆవరణతో పాటు ల్యాబ్‌లు, డిపార్ట్మెంట్లను వారు పరిశీలించారు. తరగతి గదులు, సౌకర్యాలు, విద్యార్థినుల వెయింటింగ్ హాల్‌లను పరిశీ లించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశమయ్యారు. వారు కళాశాల చరిత్ర ఇక్కడ చదివి ఉన్నత స్థానంలో ఉన్న విధ్యార్థుల వివరాలతో పాటు ప్రస్తుతం కళాశాలలో విద్యావిధానం, ల్యాబ్ సౌక ర్యం, అధ్యాపకుల వివరాలు తదితర వాటిపై ప్రిన్సిపాల్ శ్రీపతి నాయుడు న్యాక్ బృందానికి వివరించారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్, ఎమ్మెల్యే
న్యాక్ బృందాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఆర్జేడీ రాజేందర్‌సింగ్, పాలమూరు యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తున్నామని, ఇప్పటికే రూ.10 కోట్లతో పీజీ కళాశాలలో హాస్టల్ భవనాన్ని నిర్మించి ఇచ్చామని కలెక్టర్, ఎమ్మెల్యే వివరించారు. పీజీ భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరయ్యాయని, ఇంకా నిధులకోసం ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కళాశాలలో అన్ని సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. అనంతరం అలుమిని అసోసియేషన్‌తో న్యాక్ బృందం సమావేశమైంది. అలుమిని బాడీని ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామని, మూడు నెలల క్రితం అసోసియేషన్‌ను రిజిస్ర్టేషన్ చేయించామని ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి వివరించారు. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే ఐదు లక్షలు, పూర్వ విద్యార్థులు మరో రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారని, వాటి సహాయంతో ప్రోత్సాహక కార్యక్రమాలతో విద్యా ర్థుల నైపుణ్యాలకు గుర్తింపునిస్తామని వివరించారు. అలుమిని బాడీ పూర్వ విద్యార్థుల సహకారంతో నిధులను సమకూర్చుతున్నదని చెప్పారు. సైంటిస్టులు, ప్రొఫెసర్లుగా ఉన్న పూర్వ విద్యార్థులను వారికి పరి చయం చేశారు. వారు తమవంతుగా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని వారు బృందానికి వివరించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో వారు సమావేశం నిర్వహించారు.
గద్వాల కళాశాల చరిత్ర ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి కళాశాల అయిన మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1960-61లో ప్రారంభమైంది. సంస్థానాధీశుల కోటలో భూములు కేటాయించగా, భవన నిర్మాణం చేసి ఇంటర్, డిగ్రీ కళాశాలను నిర్వహించారు. 1996లో ఇంటర్మీడియట్ కళాశాలను వేరుచేసి, ఇదే కోటలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో చదివిన వారిలో ఎంతో మంది కలెక్టర్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గద్వాల ఎంఏఎల్‌డీ కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆరు బ్లాక్‌లు, 54 గదులు, ల్యాబ్‌లు, సెమినార్ హాల్స్, లైబ్రరీ, కంప్యూటర్, డిజిటల్ ల్యాబ్‌లు, తరగతి గదులు, అన్ని డిపార్ట్మెంట్లకు ప్రత్యేక గదులతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 14 కోర్సులలో 2,382 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం కళాశాలలో ఐదు పీజీ కోర్సులను కూడా ప్రారంభించారు. 53 మంది అధ్యాపకులు, 28 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రెండు న్యాక్ బృందాల పరిశీలన సందర్భంగా కళాశాల ‘బీ’ గ్రేడ్ సాధించింది. ఈ సారి వచ్చిన న్యాక్ బృందం కళాశాలకు ‘ఏ’ గ్రేడ్‌ను ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
