చెరువు కట్ట నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2022-12-31T22:59:05+05:30 IST

వెల్టూరు గోపాల సముద్రం చెరువు కట్ట మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.

చెరువు కట్ట నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
గోపాల సముద్రం చెరువు కట్ట పనులను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి, డిసెంబరు 31: వెల్టూరు గోపాల సముద్రం చెరువు కట్ట మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం చెరువు కట్ట మరమ్మతు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి వచ్చిన కొద్ది సేపటికి అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైన పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. చెరువు పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారి ఎస్‌ఈ సత్యశీలారెడ్డికి, కాంట్రాక్టర్‌ రంగారెడ్డికి సూచించారు. చెరువులో ఒండ్రు మట్టి తీయాలని అందుకు గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. గోపాల సముద్రం చెరువు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయని, సాగు విస్తీర్ణం పెరుగుతుందని రైతులు సుభీక్షంగా ఉంటారని అన్నారు. రాబోయే రోజుల్లో గోపాల సముద్రాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని, చెరువు కట్టపై బీటీ రోడ్డు వేయడం జరుగుతుందని అందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, తండా వాసులకు, మండల జిల్లా కేంద్రానికి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షడు శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, చిన్న, రఘు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:59:10+05:30 IST