దేహదారుఢ్య పరీక్షలకు రెడీ

ABN , First Publish Date - 2022-12-06T22:58:18+05:30 IST

పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దేహదారుఢ్య పరీక్షలకు రెడీ
పరుగు కోసం మహబూబ్‌నగర్‌లోని స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన ట్రాక్‌లు

రేపటి నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌

మహబూబ్‌నగర్‌ స్టేడియం మైదానంలో ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 6: పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్టేడియం మైదానం ముస్తాబవుతోంది. దాదాపు 25 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 23,747 మంది అభ్యర్థులు పాల్గొననున్నారు. ఇందుకోసం వారం రోజులుగా పోలీస్‌శాఖ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అభ్యర్థుల్లో 19,504 మంది పురుషులు కాగా, 4,243 మంది మహిళలున్నారు. మైదానంలో పరుగు కోసం రన్నింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటుచేశారు. ట్రాక్‌లో ఒక రౌండ్‌ కొడితే 400 మీటర్లు పూర్తవుతుంది. పురుషులకు 1,600 మీటర్ల పరుగుకు గాను నాలుగు రౌండ్లు వేయాల్సి ఉంటుంది. అదే మహిళలకు 800 మీటర్లు ఉన్నందున రెండు రౌండ్లు పరుగెత్తాల్సి ఉంటుంది. ఈనెల ఎనిమిది నుంచి ఈ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నందున ఒకరోజు ముందుగా అంటే బుధవారం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. పరుగుతోపాటు షార్ట్‌పుట్‌ లాంగ్‌జంప్‌, ఎత్తులకు సంబంధించి ట్రయల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్‌ఎఫ్‌ఐటీ విధానం ద్వారా ఈవెంట్లను లెక్కించనుండటంతో ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండబోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులను తప్ప ఇతరులను మైదానంలోకి అనుమతించడం లేదు. అడ్మిట్‌కార్డ్‌, పార్ట్‌-2 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌, కుల ధ్రువీకరణ, కమ్యూనిటీ సర్టిఫికెట్‌లతో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్ల కోసం పోలీస్‌శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేయనుంది.

ప్రలోభాలను నమ్మి మోసపోవద్దు

పోలీస్‌శాఖలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు జరిగేందుకు అవకాశం లేదని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు. నా బంధువు అయినా నేను సహాయం చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు జరుగుతాయని, ప్రలోభాలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు తమ సామర్థ్యాలనే నమ్ముకోవాలని, పైరవీకారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎవరైన ప్రలోభాలకు గురిచేసి డబ్బులు అడిగితే పోలీసుల దృష్టికి తేవాలని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్‌ఎఫ్‌ఐడీ సెన్సార్లలో అభ్యర్థుల పరుగు రికార్డ్‌ అయి ఉంటుందని, సీసీ కెమెరాల్లో లైవ్‌ వీడియో కూడా ఉంటుందని అన్నారు. అది కమాండింగ్‌ కంట్రోల్‌ విభాగం హైదరాబాద్‌కు చేరుతుందన్నారు. అభ్యర్థుల క్వాలిఫై అక్కడి నుంచే వస్తుందన్నారు. ఎత్తు కొలిచేందుకు కూడా కింద, పైన సెన్సార్లను అమర్చామన్నారు. అభ్యర్థులు పైన, కింద ఈ రెండు సెన్సార్‌లు టచ్‌ అయితేనే ఎత్తు డిజిటల్‌ డిస్‌ప్లేలో కనిపిస్తుందన్నారు.

తొలి రోజు 600 మంది

తొలి రోజు 600 మందికి, రెండో రోజు 800 మందికి, ఆ తరువాత ప్రతీ రోజు 1,200 మందికి పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు అన్ని ఈవెంట్లలతో విధిగా ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. పరుగు తప్ప మిగతా ఈవెంట్లకు మార్కులు లేవని, క్వాలిఫై అయితే చాలన్నారు. ఏ ఒక్కటి ఒక్కటి ఫెయిల్‌ అయినా వెనుదిరగాల్సిందేనని వివరించారు. అభ్యర్థులు ఉదయం ఐదు గంటలకే స్టేడియం మైదానం వద్దకు చేరుకోవాల్సి ఉంటుందని, బయోమెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రలు సేకరిస్తారని చెప్పారు. ఆరోజు ఉన్న చివరి అభ్యర్థి పూర్తయ్యేవరకు ఈవెంట్లు కొనసాగుతాయని తెలిపారు. పురుషులు 1,600 మీటర్ల పరుగు 7.25 నిమిషాలు, మహిళలు 800 మీటర్ల పరుగు 5.20 నిమిషాలలో పరుగెత్తితే క్వాలిఫైల్‌ అవుతారన్నారు. ఎంత త్వరగా పరుగును సాధిస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయన్నారు. కేటాయించిన తేదీలో కచ్చితంగా హాజరుకావాలని, ఆరోజు వీలు కానివారు అంటే అనారోగ్యం ఉంటే కచ్చితమై ధ్రువీకరణ పత్రాలను 3-4 రోజులు ముందుగానే సమర్పించాలన్నారు. తమ వద్ద ఉన్న వైద్యుడు కూడా చెక్‌ చేస్తారని, ఆ తరువాత కమిటీ అనుమతిస్తేనే మరో తేదీన పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పోలీస్‌ ఉన్నతాధికారులు స్టేడియం మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ ఏ.రాములు, డీఎస్పీ మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:58:19+05:30 IST