వర్షం నష్టం

ABN , First Publish Date - 2022-10-08T04:34:48+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

వర్షం నష్టం
నారాయణపేట మండలం ఎంనోన్‌పల్లిలో నీట మునిగిన పత్తి పంట

పలు చోట్ల తెగిన రోడ్లు..

నారాయణపేట జిల్లాలో నీట మునిగిన పత్తి, కంది పంటలు

హైదరాబాద్‌ వెళ్లే బస్సులు బిజినేపల్లి వయా మంగనూరు మీదుగా దారి మళ్లింపు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు చోట్ల నిలిచి పోయిన రాకపోకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూలిన ఏడు ఇళ్లు


బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లాలో పంటలు నీట మునిగాయి. పలు జిల్లాల్లో చెరువులు, వాగుల ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. మరోవైపు లోలెవల్‌ బ్రిడ్జిలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గ్రామం జడ్చర్ల మండలం వల్లూరు నీట మునిగింది. మహబూబ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.

- ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌


నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి), అక్టోబరు 7: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జనం పలు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వారం రోజులుగా కురిసిన వర్షాలతో దుందుభీ నదితో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నా యి. బిజినేపల్లి, వట్టెం మధ్య లోలెవల్‌ బ్రిడ్జి వద్ద వరద నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరడంతో కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నుంచి వయా జడ్చర్ల మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను భూత్పూర్‌ మీదుగా దారి మళ్లించారు. కల్వకుర్తి నుంచి సిర్సవాడ, నాగర్‌కర్నూల్‌కు వెళ్లే వాహనాలు దుందుభీ ప్రవాహం కారణంగా కల్వకుర్తి, తాడూరు మీదుగా వెళ్తున్నాయి.


నీట మునిగిన పంటలు

నారాయణపేట: వర్షాల కు నారాయణపేట జిల్లాలో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, కంది పొలాల్లో నీరు నిలిచి, నష్టం వాటిల్లింది. పత్తి నల్లబారడంతో పాటు కాయలు రాలిపోతు న్నాయని, తెగుళ్లు ఆశిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దాదాపు 33 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికా రులు ప్రాథమికం గా అంచనా వేశా రు. ఊట్కూర్‌ మం డలంలో 12,500 ఎకరాల్లో పత్తి నీట మునిగినట్లు వ్యవ సాయ అధికా రులు తెలిపారు.


నేల రాలిన పత్తి

కృష్ణ: కృష్ణ మండలం ఖాన్‌ దొడ్డి గ్రామ శివా రులో పత్తి పంట నేల వాలినట్లు రైతులు తెలిపారు. పగిలిన పత్తి వర్షా నికి తడిసిందని, మొక్కలు నేల వాలడంతో నీటిలో మునిగి మురిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


గ్రామాలకు తెగిన రాకపోకలు

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మం డలం పోలేపల్లి- కిస్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోడ్డుపైకి వరద నీరు చేరడం, కల్వర్టు నీటమునిగిపోవడంతో వాహనాలు దాటలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో శుక్రవారం రెండు గ్రామాల మధ్య, ఇక్కడి నుంచి జడ్చర్లకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బం దులు పడ్డా రు. 


సీసీకుంట మండలంలో..

చిన్నచింతకుంట: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తారు. దాంతో నక్కల వంపు, ఊకచెట్టువాగులో వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సీతారాంపేట, చిన్న వడ్డెమాన్‌, అల్లీపురం గ్రామాల సమీపంలోని వంతెనలపై నీరు పారటంతో ఆత్మకూర్‌, హైదరాబాద్‌, దమాగ్నాపూర్‌, వడ్డెమాన్‌లతో పాటు చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


కూలిన  ఇళ్లు

వనపర్తి టౌన్‌/వీపనగండ్ల: వర్షాలకు వనపర్తి జిల్లాలో రెండు ఇళ్లు కూలిపోయాయి. వనపర్తి పట్టణంలో ఒకటి, వీపనగండ్ల మండలం తూము కుంటలో ఒక ఇల్లు కూలి పోయాయి. వనపర్తి పట్టణం లోని పదో వార్డు నాగవరంలో గురువారం రాత్రి బోయ లక్ష్మి ఇల్లు కూలిపోయింది. మునిసిపల్‌ కమిషనర్‌ విక్రమసింహా రెడ్డి ఇంటిని పరిశీలించారు. వీపనగండ్ల మం డలం తూముకుంటకు చెందిన హరిజన స్వామి మట్టి మిద్దె శుక్రవారం కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరుగ లేదు.

గండీడ్‌లో

గండీడ్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పంచాంగాల తండాలో లావుడ్యా చందర్‌ ఇల్లు గురువారం రాత్రి కూలిపోయింది. చందర్‌ బతుకు దెరువు కో సం పూణె వలస వెళ్లాడు. అతనికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు.


నారాయణపేట జిల్లాలో మూడు

ఊట్కూర్‌: నారాయణ పేట జిల్లా ఊట్కూర్‌ మండ లం పెద్దపొర్ల గ్రామానికి చెందిన కొతి నర్సమ్మ మట్టి ఇల్లు శుక్రవారం కూలిపోయింది. చిన్నపొర్లలో మీసాల సిడప్ప ఇల్లు, పులిమామిడిలో బాలప్ప ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.


ఇల్లు కూలి గాయాలు

తాడూరు: నాగర్‌కర్నూల్‌ జిల్లా మండలంలోని అల్లాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం పురాతన ఇంటి పైకప్పు కూలి పడటంతో గ్రామానికి చెందిన ఎల్లయ్య కుమారుడు శివకు తీవ్ర గాయాలయ్యాయి. తలపై దూలం పడటంతో గాయమై, ఎనిమిది కుట్లు పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్‌ఐ గోపాలకృష్ణ పంచనామా చేశారు.


నీట మునిగిన ముంపు గ్రామ ఇళ్లు

జడ్చర్ల: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గ్రామమైన వల్లూరులోని ఇళ్ల మధ్యన వరద నీరు నిలిచింది. పథకంలో భాగంగా చేపట్టిన ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీరు చేరడం, ఆ నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో వల్లూరులోకి నీరు చేరింది. ఎస్సీ కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. పునరావాస గ్రామం ఏర్పాటు చేసి, తరలించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని గ్రామస్థులు వాపోయారు. ఇళ్ల మధ్యకు నీరు చేర డంతో ఇంట్లో ఉండా లంటే భయమేస్తోందని అంటున్నారు.


వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

కోడేరు: పొలం వద్దకు వెళ్తూ వాగు దాటుతుండగా, అందులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం ఖానాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన ఆది బంగారయ్య(46), అతని భార్య లక్ష్మి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లేందుకు బయల్దేరారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భార్యను వాగు ఒడ్డున ఉంచి, బంగారయ్య వాగు దాటే ప్రయత్నం చేశాడు. నీటి ఉధృతికి నీరు వెళ్లేందుకు వేసిన తాత్కాలిక పైపుల్లో ఇరుక్కొని, పైపుల గుండా బయటకు కొట్టుకుపోయి జమ్ముగడ్డిలో ఇరుక్కున్నాడు. గ్రామస్థులు గాలించగా, అప్పటికే మృతి చెందాడు. కళ్ల ముందే భర్త నీటిలో కొట్టుకుపోయి చనిపోవడంతో భార్య లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కోడేరు, ఖానాపూర్‌ ప్రజలు వాగు వద్దకు తరలొచ్చారు. బంగారయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


కోయిల్‌సాగర్‌లో కొనసాగుతున్న నీటి విడుదల

దేవరకద్ర: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల  చేస్తున్నారు. 11,000 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.6 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. గేట్లు తెరవడంతో ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.


జూరాలకు నిలకడగా ఇన్‌ఫ్లో 

ధరూరు: జోగు ళాంబ గద్వాల జిల్లాలో ని ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగు తుండటంతో గేట్లను మూసి వేశారు.     ప్రస్తుతం జలా శయంలో  318.040 మీటర్ల వద్ద(8.690 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా నమోదవగా, జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రానికి 39,838 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు యూనిట్ల ద్వారా 130 మెగావాట్ల  విద్యుత్‌ ఉత్పత్పి అవుతోంది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు, భీమా లిఫ్ట్‌-1,  భీమా లిఫ్ట్‌-2, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌లకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ నుంచి 820 క్యూసెక్కులు,  కుడి కాల్వ నుంచి 602 క్యూసెక్కులు, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా 115 క్యూసెక్కులు,  సమాంతర కాల్వ నుంచి 105 క్యూసెక్కులు మొత్తం  జలాశయం నుంచి 45,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 











Updated Date - 2022-10-08T04:34:48+05:30 IST