అధికారం చేరువగా పాలమూరు వేదికగా

ABN , First Publish Date - 2022-03-06T05:09:27+05:30 IST

రాష్ట్రంలో గద్దె నెక్కాలంటే తెలంగాణలోనే పెద్దదైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను వేదిక చేసుకోవాలని ఆయా రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి.

అధికారం చేరువగా పాలమూరు వేదికగా

ఇక్కడ ఆధిక్యత సాధించడం ద్వారా అధికారానికి దగ్గరవ్వాలనే వ్యూహాలు

ఈనెల 8న వనపర్తికి సీఎం కేసీఆర్‌ 

13న కొల్లాపూర్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

బీజేపీ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర

ఇప్పటికే బీఎస్పీ యాత్రలు, సిద్ధమైన డీఎస్‌పీ


రాష్ట్రంలో గద్దె నెక్కాలంటే తెలంగాణలోనే పెద్దదైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను వేదిక చేసుకోవాలని ఆయా రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. నమ్మిన పార్టీని పూర్తి విశ్వాసంతో గెలిపించే ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అధికారానికి దగ్గరి దారులు వేసుకోవచ్చని యాత్రలు షురూ చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పుల వల్ల అధికార టీఆర్‌ఎస్‌ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చనే అభిప్రాయంతో ఆయా పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ క్యాడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈనెలలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ యాత్రలు మొదలవుతున్నాయి. ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అనేది ఇప్పుడే తేలని అంశం..

- ఆంరఽధజ్యోతి ప్రతినిధి. మహబూబ్‌నగర్‌


 అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాతో రాజకీయ పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. దక్షిణ తెలంగాణలో కీలకమైన పాలమూరులో తమ ఆధిక్యతను చాటి ఇక్కడ పూర్తి మెజార్టీ సాధించడమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆధిక్యతను కొనసాగించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే, ఇక్కడ పట్టు సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పైచేయి సాధించాలని కాంగ్రెస్‌, ఇక్కడి నుంచే తమ ప్రాభవాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈనెలలో ఈ మూడు పార్టీలు కీలకనేతల పర్యటనలు చేపట్టడం ద్వారా రాజకీయ జోష్‌ పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 8న వనపర్తిలో సీఎం కేసీఆర్‌, 13న కొల్లాపూర్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటనలు ఖరారు కాగా బీజేపీ రెండో విడత ప్రజా సం గ్రామ యాత్ర సైతం ఈనెలలో గద్వాల నుంచే ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చారు. వీరితో పాటు బీఎస్పీ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉమ్మడి జిల్లాలో తర చూ పర్యటిస్తూ తన ప్రాబల్యం చాటే ప్రయత్నం చేస్తుండగా, దళితశక్తిప్రోగ్రామ్‌ వ్యవస్థాపకుడు విశారదన్‌ మహారాజ్‌ సైతం తాను చేపట్టబోయే మహాపాదయాత్రను కల్వకుర్తి నుంచే ప్రారంభించనున్నారు.


దక్షిణ తెలంగాణలో పాలమూరే కీలకం

దక్షిణ తెలంగాణలో కీలకమైన పాలమూరు ఉమ్మడి జిల్లాపై అన్ని పార్టీలు దృష్టిసారిం చాయి. 14 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో ఆధి క్యత సాధిం చడ మే లక్ష్యంగా కీలక నాయకులు గురిపెట్టారు. ఇక్కడి ప్రజలు ఎటు మొగ్గినా, ఏపార్టీని ఆదరించినా పూర్తి మెజార్టీ కట్టబెట్టడమే కాకుండా పార్టీకి అండగా ఉంటూ వస్తోన్న చరిత్ర ఉండటంతో ఇక్కడి ప్రజల మనసులను గెలుచుకునేందుకు ఆయాపార్టీలు రంగంలోకి దిగాయి. తొలుత కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలా ఉన్న పాలమూరు తర్వాత టీడీపీ, మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక టీఆర్‌ఎస్‌కు సైతం అండగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన 2009 ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి 2014లో ఆ పార్టీకి మెజార్టీ సీట్లివ్వడం ద్వారా అధికారానికి దగ్గరి దారి ఇచ్చింది. 2018లోనూ అదే పరిస్థితి  కనిపించింది.


సొంత ఇలాకాలో రేవంత్‌ అడుగులు..

పీసీసీ అ ధ్య క్షుడు రేవంత్‌రెడ్డికి పాలమూరు సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఆధి క్యత సాధించడమే లక్ష్యంగా  పావులు కదుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక మహబూ బ్‌నగర్‌లో నిరు ద్యోగ జంగ్‌ సైరన్‌ సభను విజయవంతంగా నిర్వహిం చారు. తాజాగా పీసీసీ చేపట్టిన ’’మన ఊరు- మన పోరు’’ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్‌లో ఈనెల 13న సభ నిర్వహిస్తున్నారు. భూనిర్వాసితుల సమస్యలు, పోడుభూముల సమస్యలపై ఈ సభ నుంచి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. నల్లమల కేంద్రంగా ఉన్న గిరిజన, గిరిజనేతరులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పోడుభూములపైనా రేవంత్‌ దృష్టిసారించారు. రేవంత్‌ పీసీసీ బాధ్యతలు చేపట్టాక పార్టీ శ్రేణుల్లోనూ కదలిక మొదలైంది. 


పట్టు సడలని గులాబీ దళం

పాలమూరుపై పట్టును కొనసాగించేలా టీఆర్‌ఎస్‌ వ్యూహాలు అమలు చేస్తోంది. జిల్లాలో ప్రతిపక్షాలకు చెందిన క్షేత్రస్థాయి నాయకులను తమవైపు తిప్పుకోవడంతో పాటు, జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, గురుకులాల ఏర్పాటు, మెడికల్‌ కాలేజీలు, ఇతర అభివృద్ధి పనుల్ని ఉదహరిస్తూ, మరోవైపు పాలమూరు పథకానికి ప్రతిపక్షాలే అడ్డంకి అనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయి వరకు బలంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు.   ఈనెల 8న వనపర్తి నుంచే ’’మన ఊరు- మన బడి’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు వచ్చే సందర్భంలోనే బహిరంగసభను సైతం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 


ఆధిక్యతే లక్ష్యంగా బీజేపీ పావులు

జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న బీజేపీ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి సైతం తెలంగాణలో బీజేపీ పాగావేసేందుకు పాలమూరు నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహదారుల విస్తరణలు, అమృత్‌ పథకాలు, ఆయుష్మాన్‌భవ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. పార్టీని విస్తృతపరచడంలో భాగంగా రెండోవిడత ప్రజాసంగ్రామయాత్రను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలని నిర్ణయించడం ఈ ప్రాంతంపై పార్టీ పెట్టుకున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. కేసీఆర్‌ ముందస్తు సంకేతాలతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవాలని ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సమీకరణలు చేస్తున్నాయి. 

Read more