గద్వాల బాలికకు జాతీయ స్థాయి బహుమతి
ABN , First Publish Date - 2022-06-01T05:34:21+05:30 IST
జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గద్వాలకు చెందిన విద్యార్థిని చతురిమ జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నది.
గద్వాల టౌన్, మే 31 : జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గద్వాలకు చెందిన విద్యార్థిని చతురిమ జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం (ఎస్‌ఎస్‌ఏ)లో పనిచేస్తున్న అనురాధ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె చతురిమ వట్టెం నవోదయ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ‘ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఫ్రం హాంఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో’ అంశానికి సంబంధించి వ్యాసరచన పోటీలో చతురిమకు ప్రథమ బహుమతి లభించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశం మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డీఎంహెచ్‌వో చందూనాయక్ బాలికకు రూ.25వేల బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్‌లు, విద్యాశాఖ జిల్లా సమన్వయ అధికారులు హంపయ్య, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. డీఈవో మహ్మద్ సిరాజుద్దీన్, ఏసీఈ శ్రీనివాసులు, సూపరిన్‌టెండెంట్ వీరశేఖర్, సిబ్బంది సాగర్, రాధాకృష్ణారెడ్డి, విద్యార్థినిని అభినందించారు.