భూసేకరణ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T22:48:46+05:30 IST

బీమా, కోయిల్‌సాగర్‌ కాల్వల పనులకు సంబంధించి మిగిలిన భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేసి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

భూసేకరణ పనులు పూర్తి చేయాలి
సమీక్షలో పాల్గొన్న ఇరిగేషన్‌ ఈఈలు, కలెక్టర్‌ శ్రీహర్ష

కలెక్టర్‌ శ్రీహర్ష

బీమా, కోయిల్‌సాగర్‌ కాల్వల పనులపై ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమీక్ష

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 7 : బీమా, కోయిల్‌సాగర్‌ కాల్వల పనులకు సంబంధించి మిగిలిన భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేసి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బీమా కింద ఒక ప్యాకేజిలో 50 ఎకరాలు, మరో ప్యాకేజిలో 83 ఎకరాల భూ సేకరణ పూర్తిచేసి ఇరిగేషన్‌ శాఖకు అప్పగించాల్సి ఉందన్నారు. ఇప్పటికే అవార్డు పాస్‌చేసి పరిహారం డబ్బులు కోర్టులో డిపాజిట్‌ చేసినవి, టైటిల్‌ క్లియర్‌ ఉన్న వాటికి పరిహారం చెల్లించి ఇరిగేషన్‌ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సర్వేయర్లను ఆదేశించారు. కోయిల్‌సాగర్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. అదే విధంగా రబీ పంటకు ఈ కాల్వల ద్వారా ఎంతవరకు సాగు నీటిని అందించగలమనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల పునరావాసంపై త్వరగా చర్యలు తీసుకొని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ శివధర్మ తేజ రెండు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉందని బీమా కింద 20వేల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ ద్వారా కుడి కాల్వకు 7,500 ఎకరాలకు సాగు నీరందించే అవకాశముందన్నారు. ఈఈలు ప్రతాప్‌సింగ్‌, సంజీవ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

కంటి వెలుగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి..

వచ్చేనెల 18నుంచి చేపట్టనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మండలాభివృద్ధి అధికారులు, పుర కమిషనర్లు, ఎంపీవోలు, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి కంటి వెలుగు ద్వారా పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు, అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు వంద రోజుల్లో జిల్లాలోని 18 ఏళ్లు దాటిన వారికి వైద్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 24 టీంలను ఏర్పాటు చేశామని, ఆయా మునిసిపల్‌, పంచాయతీలు, వార్డుల్లో ఏరోజు ఎక్కడ కంటి వెలుగు కార్యక్రమం పట్టాలనేది ప్రణాళిక చేసి ఈనెల 12లోగా డీఎంహెచ్‌వోకు నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష యోజన, పీఎం జేఏవైపై మాట్లాడుతూ పంచాయతీ, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, మల్టి లేవల్‌ వర్కర్స్‌లకు పీఎం సురక్ష యోజన బీమా చేయించాలని ఆదేశించారు. ప్రతీ కార్మికుడికి రూ.12 చెల్లించి పంచాయతీ, పుర కార్యాలయం తరపున ఇన్సూరెన్స్‌ చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలు జరగాలని నిర్దేశించిందని , ఇందుకు వ్యాపారులను గుర్తించి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు నివేధిక అప్పగించాలన్ననరు. పంచాయతీ కార్యదర్శి తమ మొబైల్‌లో పల్లె ప్రకృతి వనాలు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడాప్రాంగణం, బృహత్‌ ప్రకృతి వనాలు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలకు ఎఫ్‌టీవో అప్‌లోడ్‌ పూర్తిచేసి పేమెంట్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.250 కూలి అందేలా చూడాలని, నర్సరీల్లో ఇప్పటి వరకు పాత మొక్కలు 6లక్షల వరకు ఉన్నాయని వాటికి బ్యాగ్‌ మార్చడం, బెడ్‌లు మార్చడం వంటివి చేసుకొని మొక్కలు పెరిగేలా చూడాలన్నారు. వచ్చే మూడు నెలల్లో ఉపాధి హామీ కింద ప్రతీ పంచాయతీలో ఒక ఎంఐ ట్యాంకు, మూడు కిలో మీటర్లు పొలాలకు వెళ్లే మట్టి రోడ్డు పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌, డీపీవో మురళి, డీఎంహెచ్‌వో రాం మనోహర్‌రావు, డీఎల్పీవో సుధాకర్‌, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:48:47+05:30 IST