గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’
ABN , First Publish Date - 2022-12-17T23:10:49+05:30 IST
గర్భిణుల్లో వచ్చే రక్తహీనతను అరికట్టడానికి, వారి పోషకాహార స్ధాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ను అందజేస్తోందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
- పోషకాహార స్థాయిని మెరుగుపర్చేందుకు కిట్
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, డిసెంబరు 17: గర్భిణుల్లో వచ్చే రక్తహీనతను అరికట్టడానికి, వారి పోషకాహార స్ధాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ను అందజేస్తోందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పంపిణీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మండలాలు, మునిసిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల పరిధిలోని గర్భిణులకు డెలివరీకి ముందు, తర్వాత న్యూట్రిషన్ కిట్ అందిస్తే వారి ఆరోగ్యం బలపడుతుందన్నారు. పీహెచ్‌సీ పరిధిలో పంపిణీ చేయాల్సిన న్యూట్రిషన్ కిట్లను ఒక స్టోరేజీ రూంలో ఉంచి ప్రణాళికాబద్దంగా పంపిణీ చేయాలన్నారు. ఎంతమంది గర్భి ణులు ఉన్నారు, ఏ రోజు ఎంతమందికి అందజేశారు అనే వివరాలను పొందుపర్చాలన్నారు. కిట్ల కోసం వచ్చే గర్భిణులకు తాగునీరు, టాయిలెట్స్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులను రక్తహీనత నుంచి కాపాడుకునేలా వారి కుటుంబ సభ్యులకు ఆశలు, ఏఎన్‌ఎంలు జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఏ రోజు ఏ సెంటర్ నుంచి ఎంతమందికి కిట్టు పంపిణీ చేశారో జాబితాను వైద్యాధికారికి పంపించాలన్నారు. సమావేశంలో మాతాశిశు సంరక్షణ అధికారి ముసాయిదాబేగం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్‌క్రాంతి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ, డిప్యూటీ డీఎం హెచ్‌వో సిద్దప్ప, డాక్టర్లు మారుతినందన్, ఇర్షాద్ తదితరులున్నారు.