ఆసరా అందేనా?

ABN , First Publish Date - 2022-01-04T04:38:12+05:30 IST

ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖా స్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆగస్టులో జీవో నంబర్‌ 17ను జారీ చేసి, మీసేవలో దరఖాస్తు చేసుకోవా లని చెప్పారు.

ఆసరా అందేనా?

అర్హత వయస్సు తగ్గించి, ఆశలు పెంచి..

మూడేళ్లయినా అందని కొత్త పింఛన్లు

57 ఏళ్ల వయసు సడలింపుతో దరఖాస్తు చేసుకున్న వారు 12,460 మంది


గద్వాల, జనవరి 3: ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖా స్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆగస్టులో జీవో నంబర్‌ 17ను జారీ చేసి, మీసేవలో దరఖాస్తు చేసుకోవా లని చెప్పారు. దీంతో జోగు ళాంబ గద్వాల జిల్లా నుంచి దాదాపు 12,460 మంది దరఖా స్తు చేసుకున్నారు. అందులో గద్వాలకు చెందిన వారు 1,650 ఉన్నారు. ధరూర్‌ 1,385, గట్టు 1,131, మల్దకల్‌ 1,000, కేటీదొడ్డి 969, అలంపూర్‌ 718, అయిజ 1,817, ఇటిక్యాల 1,009, వడ్డేపల్లి 677, రాజోలి 841, ఉండవెల్లి 684, మానవపాడులో 579 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలించ లేదు. 57 ఏళ్లు దాటిన వారిని ఎంపిక చేయడానికి నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రకటించ లేదు. దరకాస్తు చేసుకున్న వారిలో కొందరికి ఇప్పటికే 65 ఏళ్ల అర్హత వయస్సు దాటిందని, అయినా ఆసరాకు నోచుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.


అర్హత కలిగిన వారు 7,334 మంది

57 ఏళ్లు ఉన్న వారు కాకుండా 65 ఏళ్లు దాటిన వారు, వితంతువులు, దివ్యాంగులు 7,334 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని, పడిగాపులు కాస్తున్నారు. వారిలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు 1,736 మంది ఉండగా, ఈ మూడేళ్లలో భర్తలను కోల్పోయి ఇంటిని ఒంటిచేత్తో నడుపుతున్న మహిళలు 3,409 మంది ఉన్నారు. ఇక దివ్యాంగులు 1,893 మంది ఉన్నారు. ఒంటరి మహిళలు 152 మంది, వీవర్స్‌, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు 144 మంది వరకు ఉన్నారు. వీరంతా పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దివ్యాంగులు మండల పరిషత్‌, డీఆర్‌డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం తమ దరఖాస్తులను పరిశీలించి, పింఛన్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు.


జిల్లాలో 61,574 మంది పింఛన్‌దారులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం ఆసరా పింఛన్‌ పొందుతున్నవారు 61,574 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.13.98 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్యాప్య పింఛన్లు రూ.4.14 కోట్లు, వితంతువులకు రూ.5.77 కోట్లు, దివ్యాంగులకు రూ. 3.21 కోట్లు ఇస్తున్నారు. ఒంటరి మహిళలు, వీవర్స్‌, గీత, బీడీ కార్మికులకు 4,051 మంది ఉండగా, వీరికి ప్రతీ నెల రూ.85.42 లక్షలు చెల్లిస్తున్నారు. 

Updated Date - 2022-01-04T04:38:12+05:30 IST