రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
ABN , First Publish Date - 2022-08-18T04:49:27+05:30 IST
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు.

- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత
- రక్తదానం చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల క్రైం, ఆగస్టు 17 : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శిబిరంలో 94 మంది రక్తదానం చేశారని తెలిపారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చన్నారు. రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం రూ. 16 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు రక్తదానం చేయగా, జడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్ వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందూనాయక్, డీఎస్పీ రంగస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రాములు, మునిసిపల్ చైర్మన్ బీఎస్ బీఎస్ కేశవ్, తహసీల్దార్ లక్ష్మి పాల్గొన్నారు.
రక్తదానం అందరి బాధ్యత : అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం
వడ్డేపల్లి : రక్తదానం చేయడం అందరి బాధ్యత అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా ముందుకొచ్చి రక్తదానం చేయడం శుభపరిణామమని చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా వడ్డేపల్లి పీహెచ్‌సీలో బుధవారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా గ్రామగ్రామాన వజ్రోత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ సుజాత, వడ్డేపల్లి ఎంపీపీ రజితరాజు, జడ్పీటీసీ సభ్యుడు రాజు, టీఆర్‌ఎస్ నాయకులు సీతారామిరెడ్డి, సూరి, శ్రీనివాస్ గౌడ్, మాణిక్యం రవి, లత, ఆంజనేయులు, హరి ప్రసాద్, తిమ్మప్ప, తహసీల్దార్ జయరాముడు, సుబ్ర హ్మణ్యం, ఎస్‌ఐలు లెనిన్, సంతోష్, ఏఎస్‌ఐ మహేష్ పాల్గొన్నారు.
బెటాలియన్ సిబ్బంది రక్తదానం
ఎర్రవల్లి చౌరస్తా : వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ సిబ్బంది బుధవారం రక్తదానం చేశారు. కమాండెంట్ రామ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో ఎనిమిది మంది సిబ్బంది రక్తదానం చేశారు.
